ప్రధాని మోడీకి గుజరాత్ తప్ప మరేమీ కనబడదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతి ప్రజావేదికలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన మోడీ ఎన్నికల ప్రచారంలో గతంలో ఇచ్చిన హామీలలో 98% అమలు చేశానని చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. ఏపీకి ఇచ్చిన హామీల మాటేమిటని నిలదీశారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా బీహార్ లో ఏపీ గురించి మాట్లాడారని మోడీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆయన ఏ హక్కు ఉందని, ఏం ఒరగబెట్టారని ఏపీ గురించి మాట్లాడారని నిలదీశారు. ఆయన ఎన్నికల ప్రచారానికి ఏపీకి వచ్చినప్పుడు కూడా ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడారని చంద్రబాబు అన్నారు.
మోడీ ఎన్ని తప్పుడు సమాచారాలు చెప్పినా మీ ప్రయత్నాలన్నీ ఇక్కడ మీకు సమర్ధించే వైకాపాను గెలిపించడానికేనని చంద్రబాబు అన్నారు. ఇక్కడ మనం సమర్ధంగా ఉండటం వల్లనే వారి కుట్రలను ఎదుర్కొనగలిగామని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీవి చౌకబారు రాజకీయాలను చంద్రబాబు విమర్శించారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రధాని మోడీ ఏ ఒక్క అంశాన్నీ పూర్తి చేయలేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను విస్మరించి ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ ఏపీని చులకన చేసి మాట్లాడారన్నారు. మోడీ మాటలకూ, చేతలకూ పొంతనే లేదని విమర్శించారు. ఆయనవన్నీ అవకాశ వాద రాజకీయాలని ఫైర్ అయ్యారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన అన్యాయానికి ఆయన ఆత్మ క్షోభిస్తుందని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని గుంటూరులో మోదీ ఇటీవల వ్యాఖ్యలు చేశారని, మరి, అద్వాణీకి మీరు చేసింది ఏమిటి? అంటూ మోదీకి సూటి ప్రశ్న వేశారు. ప్రజాస్వామ్యంపై నెల్సన్ మండేలా చెప్పిన మాటలు మోదీకి సరిపోతాయని అన్నారు. ఏపీలో అభివృద్ధిని చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని, పన్నులు కట్టించుకుంటున్నారే తప్ప న్యాయం చేయడం లేదని విమర్శించారు. మోదీకి ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని దుమ్మెత్తిపోశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ, మోదీపై ఏపీ ప్రజలకు ఆవేదన, ఆక్రోశం, బాధ, కోపం ఉన్నాయని అన్నారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని తెలుసుకుందని, అందుకే, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు.