ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న అన్యాయం పై తాను చేస్తున్న పోరాటాన్ని తీవ్రతరం చేసిన సీఎం చంద్రబాబునాయుడు, ఈ ఉదయం అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న వైఖరిని తూర్పారబడుతూ, వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్ పై వెళ్లి నిరసన తెలిపారు. కొద్దిసేపటి క్రితం వెంకటపాలెం గ్రామ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, అసెంబ్లీ వరకూ సైకిల్ పై బయలుదేరగా, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెదేపా ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. ఎంపీల మానవహారానికి వైకాపా ఎంపీల గైర్హాజరు కావడం మ్యాచ్ ఫిక్సింగ్‌కు మరో రుజువని ఆరోపించారు. పార్లమెంటు చివరిరోజు ఎంపీలు పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను బలహీన పరచాలని కేంద్రం యోచిస్తోందని.. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.తెలుగువారితో పెట్టుకోవద్దని...తమ పొట్టకొట్టదన్నారు. లేదంటే గతంలో కాంగ్రెస్‌కు పట్టినగతే తమకు పడుతుందని ప్రధాని మోదీని సీఎం హెచ్చరించారు. హక్కులు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు తెలిపారు..
తెలుగుదేశం పార్టీపై కుట్రలు పన్నుతున్నారని, అయితే... ఈ కుట్రలు తమకు కొత్తేమీకాదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే బలవంతంగా తీసుకున్నారని ఎక్కడ నుంచో వచ్చి మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. మన రాజధానిని మనమే నిర్మించుకోవాలని, ప్రతి ఒక్కరూ విరివిగా విరాళాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అండగా ఉండాల్సిన పార్టీలు టీడీపీపై బురద చల్లుతున్నాయని చంద్రబాబు అన్నారు.