ఓ వైపు సీఎం చంద్రబాబు.. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇద్దరూ సడన్‌గా విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నారు. దావోస్ పర్యటనకు చంద్రబాబు, లండన్ పర్యటనకు వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. అయితే సడన్‌గా వారిరివురూ తమ నిర్ణయాలు మార్చేసుకున్నారు. దీంతో రద్దు వెనుక అసలు కారణాలేంటి..? అమరావతిలో అసలేం జరుగుతోంది..? ఏపీ రాజకీయాల్లో ఇంత సడన్‌గా ఏం జరగబోతోంది..? అనేది అంతుచిక్కడం లేదు.. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రద్దయినట్లు ప్రకటించారు. ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు. పార్టీ నేతల సూచనతో సీఎం పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మంత్రి లోకేష్ దావోస్ పర్యటన ఖరారైంది. దావోస్‌లో సీఎం హాజరయ్యే సమావేశాల్లో లోకేష్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈనెల 21న మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలు, అర్ధరాత్రి వరకూ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టిసారించారు. దీంతో పర్యటనను రద్దు చేసుకున్న వైఎస్ వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ కూడా అభ్యర్థుల ఎంపికలపై వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో చేరికలు, అభ్యర్థుల ఎంపికపైనే ప్రస్తుతం చంద్రబాబు పూర్తి దృష్టిసారించారు. మరీ ముఖ్యంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన బాబు.. రాయలసీమ జిల్లా నుంచి తన కసరత్తు ప్రారంభించారు. అదీ కాక, అన్ని వైపుల నుంచి కుట్రలు తారా స్థాయిలో జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తే మరింత ప్రమాదమని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సడన్‌గా లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్.. హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. పాదయాత్ర అనంతరం.. సుమారు 15 నెలల తర్వాత తన పెద్ద కుమార్తె వర్షా రెడ్డిని చూడటానికి కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టూర్ రద్దైంది. ఇదిలా ఉంటే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇద్దరూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడంతో అమరావతిలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూస్తే.. ఏపీలో రెండు మూడ్రోజుల్లో భారీగానే చేరికలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ చేరికలు ఎటునుంచి ఎటు ఉంటాయన్నేది మాత్రం అంతుచిక్కడం లేదు. అయితే ఎవరు ఏ పార్టీలోకి చేరతారో.. ఎవరు సొంత పార్టీల్లో నిలబడుతారో తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.