ఒకే ఒక్క కీలక నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువు కాగలిగారు. బీజేపీయేతర పార్టీల మధ్య అనుసంధానాన్ని సాధించగలిగిన సమన్వయకర్తగా ఇతర పార్టీల విశ్వాసం సంపాదించగలిగారు. బీజేపీయేతర పార్టీలకు కొందరు సీనియర్ నేతలకు ప్రధాని పదవి పై కన్నుంది. పెద్ద పార్టీగా కాంగ్రెస్ కూడా ఆ పదవిని బలంగా కోరుకుంటోంది. దీంతో ఇతర పార్టీల సీనియర్ నేతలను పోటీదారులుగా పరిగణించి అనుమానంగా చూసే వాతావరణం నెలకొంది. ఈ పార్టీలు ఒక తాటిపైకి వచ్చేందుకు, పరస్పరం కలిసి పనిచేయడానికి ఉన్న అడ్డంకుల్లో ఇదీ ఒకటిగా పరిణమించింది.
ప్రతిపక్షాల ఐక్యతకు చొరవ తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక, దీనిపై కూడా స్పష్టత ఇవ్వాలని భావించారు. ప్రధాని పదవికి రేసులో లేనని మిగిలిన పార్టీల అధినేతలకు ఆయన ముందుగానే చెప్పేస్తున్నారని సమాచారం. నా రాష్ట్రం నాకు ముఖ్యం, నా రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం, ప్రధాని పదవి కాదు, అని చంద్రబాబు తేల్చి చెప్పేస్తున్నారు. ‘నేను రేసులో లేను. నాకు నా రాష్ట్రం ముఖ్యం. కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను దానిని విడిచి రాను. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా వాటి నుంచి దేశాన్ని కాపాడేందుకు బీజేపీయేతర పార్టీలను ఒక తాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. దేశాన్ని కాపాడాలి. ప్రజాస్వామాన్ని కాపాడాలి అన్నది నా నినాదం. ఇది మనందరి ఉమ్మడి నినాదం కావాలి. ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి నేను ముందుకొచ్చాను. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి నా వంతు సహకారం అందించడం వర కే నా పాత్ర’ అని ఆయన వారికి చెబుతున్నారు.
తనను ప్రధాని అభ్యర్థి అని గానీ లేదా జాతీయ కన్వీనర్ అని గానీ ఎక్కడా చెప్పవద్దని, ప్రచారం కూడా చేయవద్దని వారికి గట్టిగా సూచించారు. రేసులో చంద్రబాబు లేరని తెలిశాక ఇతర పార్టీల నేతలు బాగా స్పందిస్తున్నారని అంటున్నారు. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో చంద్రబాబు దానికి కన్వీనర్‌గా వ్యవహరించారు. భిన్న ధ్రువాలైన అనేక పార్టీలతో మాట్లాడి సమన్వయం చేయగలిగిన నైపుణ్యం ఆయనకు ఆ సమయంలో అలవడింది. దేవ గౌడ, గుజ్రాల్ లను, అందరినీ ఒప్పించి ప్రాధానులుగా చేసిన చరిత్ర చంద్రబాబుది. తరువాత వాజ్ పాయి హాయంలో ఎన్డీఏను కూడా చంద్రాబబే సమర్ధవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే.