ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన జన్మదినం రోజున ‘ధర్మ పోరాట దీక్ష’ పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి ఏడింటి వరకు కొనసాగనుంది. దీక్షా స్థలికి చేరుకున్న చంద్రబాబు ముందుగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ ఆలపించారు. దీక్షలో చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి అభినందించారు.
అయితే చంద్రబాబు దీక్ష చేసిన 12 గంటలు, ఆయన చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది... ఉదయం 7 గంటలకు మొదలయ్యి, సాయంత్రం 7 గంటలకు వరకు దీక్ష కొనాసాగింది.. ఈ రోజు తెల్లవారుజాము నుంచి దీక్షలో కూర్చున్న చంద్రబాబు దీక్షలో కూర్చున్న నిమిషం నుంచి ముగించే వరకు కనీసం ఒక చుక్క నీరు కూడా తాగకుండా, కూర్చున్న చోటు నుంచి సైతం కదలకుండా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది … చెరగని చిరునవ్వుతో ఉన్న చంద్రబాబు తనకు మద్దతు తెలిపిన వారిని ఆప్యాయంగా పలకరించారు... ఎంతో మానసిక ధృఢత్వం , సంకల్ప బలం ఉంటే తప్పితే 68 ఏళ్ళ వయసులో అలా కూర్చోవటం అసాధ్యం. ఒక పక్క మాడు పగిలి పోయే ఎండ... ఈ సీజన్ లో, ఈ రోజు ఎండ హైలైట్.. అయితే, చంద్రబాబు మాత్రం, తన దీక్ష ఎంతో పద్దతిగా చేసారు.. ఎంతో సంకల్పంతో, ఈ వయసులో దీక్ష చేసారు..
ఇద్దరు చిన్నారులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వేదికగా... భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. ఇది ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చంద్రబాబుకు మద్దతుగా ఆయా జిల్లాల్లో మంత్రులు దీక్షలు చేశారు. సీఎం చేపట్టిన దీక్షకు అనూహ్య మద్దతు లభించింది. అంతే కాకుండా ధర్మ పోరాట దీక్షలో సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, రాఘవేంద్రరావు, అశ్వీనిదత్, శివాజీ పాల్గొన్నారు. వీరితోపాటు రాజధాని ప్రాంత రైతులు, ముస్లింలు తమ మద్దతు ప్రకటించారు.