విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల పాటు ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు వేడుకలు జరుపకుండా, అందరూ దీక్షల ద్వారా కేంద్రానికి మన ధర్మాగ్రహం తెలపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం పుట్టినరోజు నాడు నిరశన దీక్ష చేయడం ఇదే ప్రథమం. 68 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
అయితే, ఈ దీక్షకు ముందు ప్లాన్ చేసిన ప్రకారం, దేశంలోని అన్ని జాతీయ పార్టీ నాయకులని, ఆహ్వానించాలని అనుకున్నారు. ఆ మేరకు, 8 మంది జాతీయ నాయకులతో పాటు, కొంత మంది ముఖ్యమంత్రులు కూడా వస్తామని కబురు పంపించారు. అయితే, చివరి నిమిషంలో ఒక పెద్దాయన సలహా మేరకు, ఇది వాయిదా పడినట్టు తెలుస్తుంది. మీరు రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటంలో, అన్ని జాతీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి మద్దతు ఇస్తే మంచిదే, కాని అలా చేస్తే, ఇక్కడ మీ మీద తప్పుడు ప్రచారం చెయ్యటానికి రెడీ అయ్యారు... మీరు రాజకీయం కోసమే చేస్తున్నారని, రాష్ట్రం కోసం కాదని, ప్రచారం చెయ్యటానికి రెడీ అయ్యారు. నా సలహా మేరకు, ఇప్పుడు జాతీయ నాయకులని, మీ దీక్షకు ఆహ్వానించ వద్దు అంటూ, ఆ పెద్దాయన చెప్పిన మేరకు, చంద్రబాబు కూడా ఈ విషయం వదిలేసారని సమాచారం...
అందుకే జాతీయ స్థాయి నేతలు వస్తాను అని చెప్పినా, చంద్రబాబు మరో సందర్భంలో రావచ్చు, ఇప్పుడే వద్దు అని వారిని వారించారు... ప్రత్యేక హోదా, లోటు భర్తీ, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అమరావతి నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజుపట్నం పోర్టు, శాసనసభ సీట్ల పెంపు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-విజయవాడల్లో మెట్రో రైలు, అమరావతికి రైలు-రహదారి అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సాయం, పొరుగు రాష్ట్రం నుంచి విద్యుత్ బకాయిల వసూళ్లు, షెడ్యూల్ సంస్థల విభజన, గ్రేహౌండ్ సెంటర్ ఏర్పాటు ఇలా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో పేర్కొన్న 18 అంశాలపై మాత్రమే మన ఒత్తిడి ఉండాలని, ఇప్పుడే రాజకీయాల వైపు వద్దు అని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నారు...