‘యాభై శాతం వీవీప్యాట్లను లెక్కించాలనే డిమాండుతో రాజకీయ పార్టీలతో కలిసి త్వరలోనే దేశ రాజధానిలో ధర్నా చేస్తాం’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘స్వచ్ఛంద సంస్థలూ మాకు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తేవడానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామంటున్నాయి. కొవ్వొత్తుల ర్యాలీలూ చేస్తామంటున్నాయి’ అని వివరించారు. వీవీప్యాట్లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు దానిని గాడిన పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఏపీలో తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రజలు ఓటేశారని చెబుతుంటే జాతీయ స్థాయిలో నాయకులూ ఆశ్చర్యపోయారని సీఎం వివరించారు.
. ‘మన పోరాటమంతా ఎన్నికల సంఘంపైనే.. ఇక్కడుండే అధికారులపై కాదు..’అని తెలిపారు. ఎన్నికల విధులను నిర్వహించే అధికారులను మినహాయిస్తే ఆ బాధ్యతలు లేని వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. గడచిన ఐదేళ్లలో అధికారులు బాగా సహకరించారని చంద్రబాబు ప్రశంసించారు. ఇప్పుడు వారిని కూడా కులం, మతం పేరుతో, వ్యక్తిగత ఎజెండాతో విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘అభివృద్ధిలో కులం, మతం చూడలేదు. మత సామరస్యాన్ని కాపాడా. వృద్ధులకు పింఛను, యువతకు నిరుద్యోగ భృతి.. రైతులకు అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ నాలుగో విడత నిధులు, మహిళలకు పసుపు కుంకుమ పథకాలు అమలు చేశాం.. ఇన్ని చేసినా ఎన్నికల్లో ఇచ్చే రూ.వెయ్యి, రూ.2వేలకు ఆశపడుతున్నారంటే బాధేస్తోంది. రూ.2వేలు, రూ.500 నోట్లు లేకపోతే ఈ సమస్య వచ్చేది కాదు. దీనికి మొదటి ముద్దాయి నరేంద్ర మోదీయే’ అని చంద్రబాబు విమర్శించారు.
‘ఆయన ఎన్నికల కమిషన్ను దుర్వినియోగం చేశారు. మనకున్న వ్యవస్థ కారణంగా తట్టుకోగలిగాం.. దాడులు జరిగిన తర్వాతా మన కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేశారు’ అని కితాబిచ్చారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై సామాజిక మాధ్యమాలు ఏకి పారేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల వారీగా ఏరియా సమన్వయకర్తలు, నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే కార్యకర్తల కోసం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో పార్టీకి యంత్రాంగమే శాశ్వతం. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులూ ఉండాలి. రెండు వ్యవస్థల అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.