టీడీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు... ప్రజాసమస్యలపై తక్షణం స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు సూచించారు. పంటను అమ్ముకునే పరిస్థితి లేకపోతే నిరాశకు గురవుతారని, సూక్ష్మ సాగు, సేధ్యం పనులు కోడ్ వల్ల ముందుకు సాగడంలేదని అన్నారు. దీని వల్ల ఉద్యాన పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయిన చోట్ల అభివృద్ధి కుంటుపడకుండా... ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా పాలన సాగాలని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కోడ్ నెపంతో పాలన కుంటుపడొద్దని అన్నారు. శాంతిభద్రతల విషయంలో... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించొద్దని ఈసీ ఆదేశాలివ్వాలన్నారు. అధికారులు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో టీడీపీ 100శాతం కాదు... 1000శాతం గెలుస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో ఇంతటి చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్ పెట్టుకోవద్దా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ, జూన్ 8దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్రం ఒకపక్క మనపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని, ఎన్నికల్లో పోటీలో లేనివారిపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కరిపైనా ఐటీ, ఈడీ దాడులు లేవని ఆయన విమర్శించారు.
‘‘సర్జికల్ స్ట్రైక్‌లో 350మందిని చంపేశాం అని మోదీ అన్నారు. కానీ అంతర్జాతీయంగా ఎక్కడా ఈ అంశాన్ని నిర్ధారించలేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోదీ భ్రష్టుపట్టించారు. సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ దారుణంగా వ్యవహరించాయి. మనం పోరాటం వల్లే వీవీ ప్యాట్లు వచ్చాయి. ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాదే కాకుండా ఇతర నగరాల నుంచీ ఓటేయడానికి వచ్చారు. ఒక కారును ఐదుగురు షేర్ చేసుకొని వచ్చి ఓటేశారు. కర్ణాటకలో నా ప్రచారం ప్లస్ అవుతుందని అక్కడి నేతలంటున్నారు. ఎన్నికల్లో సీబీఎన్ ఆర్మీ బాగా పనిచేసింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు చేశారు. ఎన్నికల్లో అక్రమాల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కేంద్రంలో బీజేపీకి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు’’ అని చంద్రబాబు జోస్యం చెప్పారు.