వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే నేరుగా తనకు చేయాలి, కానీ డీజీపీకి ఎలా చేస్తారని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిసారి తాను గవర్నర్‌పై స్పందిస్తున్నానని చెప్పారు. అసలు గవర్నర్ పాత్ర ఏమిటి? పరుధులు ఏంటి ? ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలనలో వేలుపెట్టే అధికారం గవర్నర్‌కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో గవర్నర్ వ్యవస్థపైనే పోరాడామని గుర్తు చేశారు. ఎవరి తరపున ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని, ఢిల్లీ స్క్రిప్టు ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
‘‘నేను ఎప్పుడూ గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్‌పై ఆయన పార్టీ కార్యకర్త దాడి చేసిన ఘటన జరిగి ఒక గంట కూడా గడవక ముందే గవర్నర్ రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేశారు. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీకి ఆయన ఎలా ఫోన్ చేస్తారు? ఆయన ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వాన్ని... నన్ను అడగాలి. నాతో మాట్లాడాలి. మా నుంచి సమాచారం తీసుకోవాలి. నేరుగా అధికారులకు ఫోన్ చేసి సమాచారం తీసుకొనే అధికారం ఆయనకు లేదు. ముఖ్యమంత్రిగా నా అనుభవం ఇప్పటికి పద్నాలుగేళ్లు! ఎవరి అధికారాల పరిధి ఏమిటో నాకు తెలుసు."
"మేం ప్రతి వ్యవస్థను గౌరవిస్తాం. కానీ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కిందా లేదు. కేంద్రం, రాష్ట్రం రెండూ వేటికి అవి స్వతంత్ర అధికార పరిధి కలిగిన ప్రభుత్వాలు. ఎవరి అధికారాలు... పరిధులు వాటికి ఉన్నాయి. రిమోట్ కంట్రోల్‌తో మమ్మల్ని పరిపాలించలేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తే సీనియర్ రాజకీయవేత్తగా తన లాంటి వాడు కూడా ప్రశ్నించకపోతే మరెవరు ప్రశ్నిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు." ఢిల్లీ స్క్రిప్టును రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తే కుదరదని అన్నారు. గవర్నర్ పై చంద్రబాబు ఇంత ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో, పరిస్థితులు ఎలా మారతాయో అనే ఆసక్తి నెలకొంది.