ఆంధ్రప్రదేశ్‌ను అన్నింటా ముందు నిలపాలని కృతనిశ్చయంతో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకునేందుకు మరోసారి విదేశీ పర్యటనకు సమాయత్తమయ్యారు. ఒకరోజు పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం దుబాయ్ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ పయనమవుతున్నారు.
ముఖ్యమంత్రి దుబాయ్‌లో అక్కడి పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో గురువారం వరుసగా ముఖాముఖి సమావేశాలు జరుపుతారు. ముఖ్యంగా ఫీనిక్స్ గ్రూపు, షరాఫ్ గ్రూపు, దాన్యూబ్ గ్రూపు ముఖ్యులతో జరిపే సమావేశాలు ఈ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదేరోజు సాయంత్రం దుబాయ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహమ్మద్ అల్ జరూనీతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ‘భాగస్వామ్య సదస్సు-2018’కి సంబంధించి రోడ్ షోలో పాల్గొంటారు.
విశాఖలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు ఇది సన్నాహకం. దుబాయ్‌లో వున్న సంస్థలు, పారిశ్రామిక-వాణిజ్య వేత్తలను భాగస్వామ్య సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆహ్వానిస్తారు. ఆంధ్రప్రదేశ్ 15% వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు చేరువకావడానికి పారిశ్రామికరంగం ముఖ్య వృద్ధికారకంగా వుండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఈ రంగంలో ఆర్ధికవృద్ధి సాధనతో యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగాలనేదే ముఖ్యమంత్రి సంకల్పం.