‘‘ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు నాదీ బాధ్యత! రాష్ట్ర ప్రజలందరికీ ఇదే నా మనవి! భావితరాల కోసం, మీ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిన పెడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమంతో అన్ని వర్గాలను ఆదుకున్నాం. రాబోయే ఐదేళ్లలో సీమాంధ్రను తెలంగాణకంటే... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. "మీ భవిష్యత్తుకు నాదీ బాధ్యత" అనేది మా ఎన్నికల నినాదం అంటూ చంద్రబాబు ప్రకటన చేసారు.

election 11032019

‘‘మీకు అండగా ఉండే ప్రభుత్వానికే ఓటు వేయండి. ఐదేళ్లు ప్రతి నిమిషం కష్టపడ్డా. ఇప్పుడు పరీక్ష ఎదుర్కొనే సమయం! ఇది నా ఒక్కడికే కాదు... రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ పరీక్ష. ఇది అందరి భవిష్యత్తుకు చెందిన అంశం’’ అని తెలిపారు. ఐదేళ్ల ప్రభుత్వ కష్టం వల్ల ప్రజలందరికీ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ‘‘హుద్‌హుద్‌ తుఫాను బీభత్సం సృష్టించినా... వారంలో విశాఖపట్నం కోలుకునేలా చేశాం. తితలీ తుఫానులో సాయం చేశాం. నాయకుడిగా ప్రతి ఒక్కరినీ అవసరానికి ఆదుకున్నా! పెద్దకొడుకుగా పింఛను పెంచాను. అన్నగా పసుపు-కుంకుమ ఇచ్చాను. పెద్ద రైతుగా రుణమాఫీ చేశాం. నంబర్‌ వన్‌ డ్రైవర్‌గా డ్రైవర్లందరికీ బీమా ఇచ్చాం. ఇలా ఏ ఒక్కరినీ విస్మరించకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందించాం. మరింత చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

election 11032019

ఇది ఆత్మగౌరవ సమస్య.. ఈ ఎన్నికలు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినవని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘కేసీఆర్‌ పంచన చేరి, తెలంగాణకు ఊడిగం చేసే జగన్‌తో కాదు! జగన్‌ను ముందు పెట్టి ఆంధ్రపై పెత్తనం చేద్దామనుకుంటున్న కేసీఆర్‌తోనే పోటీ! కేసీఆర్‌ కావాలా? చంద్రబాబు కావాలా?’’ అని ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఉన్న అర్హత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన అవినీతి గురించి అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పేపర్‌ ప్రజెంట్‌ చేశారని తెలిపారు. ‘‘తండ్రి అధికారం అండతో కొడుకు సంపాదన, అవినీతిపై హార్వర్డ్‌లో కేస్‌ స్టడీ చేశారు. నేరస్తుల మానసిక స్థితి ఎలా ఉంటుందన్న విషయాలను ప్రజంటేషన్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ... సొంతగడ్డపై ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని వెంటనే అమరావతికి తరలి వచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. ‘‘తొలిరోజు బస్సులోనే నా కార్యాలయం. ఆ తర్వాత విజయవాడలో ఇరిగేషన్‌ కార్యాలయాన్ని నా ఆఫీసుగా చేసుకున్నా. డబ్బుల్లేవు. నా పిలుపుతో రైతులు 34వేల ఎకరాలు రైతులిచ్చారు. తొమ్మిది నెలల్లో సచివాలయం, అసెంబ్లీ నిర్మించాం. హైకోర్టు ప్రారంభించాం. రాజధానిలో పలు నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కానీ, జగన్‌ హైదరాబాద్‌ను ఎందుకు వదిలిరాలేదు? లోట్‌సపాండ్‌లో కేసీఆర్‌ సహకారంతో ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేశారు. కేసీఆరే వీళ్ల అభ్యర్థుల్ని ఎంపికచేశారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని బెదిరించి వైసీపీ తరఫున పోటీచేయాలని అంటున్నారు. అసలు ఈ గడ్డపై ఉండటమే ఇష్టంలేని జగన్‌కు ఓటెందుకు వేయాలి?’’ అని ప్రశ్నించారు. ఆయనకు ఇక్కడ పోటీచేసే అర్హతే లేదన్నారు. తెలంగాణలోనే ఉండి... కేసీఆర్‌తోనే పొత్తు పెట్టుకుని ఒక 10 స్థానాలు తీసుకుని అక్కడే పోటీ చేయాలని సలహా ఇచ్చారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read