అధికార పార్టీ అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలోకి దూకేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ప్రతిపక్ష పార్టీలకు ఇప్పటి నుంచే చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరు పై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఆయన చేయించిన సర్వేలను వారి ముందే బయటపెడుతూ వారికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాల సమీక్షలను గత పది రోజులుగా నిర్వహిస్తూ లోటు పాట్లను వారి సమక్షంలోనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నేతలను సైతం చంద్రబాబు స్వయంగా నిలదీస్తున్నారు.
ఆరోపణలు ఉన్న మంత్రుల పనితీరును కూడా విశ్లేషిస్తున్నారు. సర్వే ఆధారంగా ఎమ్మెల్యేలకు జిల్లాల సర్వే నివేదికలు అందిస్తున్నారు. గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఉండదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పనితీరు మార్చుకోని పక్షంలో టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రుల్లో యాభై శాతం మంది వరకు టికెట్లు డౌటే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ సర్వే తీసుకున్నా చంద్రబాబు పై అమితమైన నమ్మకం ఉన్నా, ఆయన కష్టపడే తత్త్వం ఉన్నా, ఎమ్మల్యేల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో, అవినీతి ఆరోపణలు, పని తీరులో తేడా, అలసత్వం ఇలా ఎమ్మెల్యే ల జాతకాలను అన్ని కోణాల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు బయటకు తీస్తున్నారు. ఆరోపణల చిట్టాను వారి చేతికే అందించి దీనికి ఏమిటి మీ సమాధా నమని నిలదీస్తున్నారు.
తప్పులు దిద్దుకొని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకపోతే దెబ్బతింటారని, ఆ తర్వాత తనను అనుకుని ప్రయోజనం లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జిలతో సమావేశమవుతున్నారు. అవే విషయాలు ముఖ్యమంత్రి మొహమాటం లేకుండా చెబుతున్నారు. కేవలం ఆరోపణలే కాకుండా వారి పనితీరు, ప్రవర్తన తీరులో లోపం ఉన్నా క్యాడర్, ఓటర్లతో సరైన సంబంధాలు ఏర్పరచుకోలేకపోయినా వివరిస్తున్నారు. వారు తమను తాము దిద్దుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. దిద్దుకుంటే ఇబ్బంది లేదని, ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఈలోపు వారు సరైన దారిలోకి రావాలన్నది ఆయన ఆలోచన అని, అందుకే ఈ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.