తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వాజ్‌పేయి ఆరోగ్యంపై ఢిల్లీ అధికారులతో మాట్లాడానని బాబు ట్విట్టర్‌లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. వాజ్‌పేయి తీవ్ర అస్వస్థతకులోను కావడంతో సోమవారం ఉదయం ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంతోకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం, రొటీన్ చెకప్ కోసమే ఆయనను ఆసుపత్రికి తరలించారని బీజేపీ చెబుతున్నప్పటికీ- వాజపేయి దీర్ఘకాల అస్వస్థత దృష్ట్యా ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో వైద్యబృందం ఆయనకు సేవలందిస్తోంది. ఛాతి ఇన్ఫెక్షన్, మూత్రపిండ సమస్యలతో ఆయనను తీసుకొచ్చారని.. రక్తశుద్ధి (డయాలసిస్)తో పాటు అత్యవసర విభాగం (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. 50 నిముషాలు అక్కడే ఉండి వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తదితరులు కూడా ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు.
1998-2004 మధ్య ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయీ అనంతరం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో క్రమేపీ ప్రజాజీవితానికి దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎయిమ్స్‌కు తరలించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2009 నుంచీ ఆయన అచేతన స్థితిలోనే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే 2015లో వాజ్‌పేయీకి భారతరత్న పురస్కారాన్ని కూడా ఆయన ఇంటివద్దే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్న డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వాజ్‌పేయీకి 30 ఏళ్లుగా వ్యక్తిగత వైద్యుడు.