ఎన్నికల్లో ఓడిపోయిన మొదలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతి రోజు ఎదో ఒక అవమానం, హేళన, కక్ష సాధింపు సర్వ సాధారణం అయిపోయాయి. దేశంలోనే అతి కొద్ది మందిలో ఉండే జెడ్ + క్యాటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబుకు, జగన్ ప్రభుత్వం పైలట్ వాహనం తీసేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులు వస్తాయో తెలిసినా, ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబుని చెక్ చెయ్యటం గురించి రచ్చ అయ్యింది. అయితే ఈ విషయం పై చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కాని అక్కడ నుంచి ప్రత్యెక వాహనం లేకుండా, మిగతా ప్రజలతో ఒకే బస్సులో ఫ్లైట్ వరకు తీసుకు వెళ్ళటం మాత్రం అభ్యంతరం చెప్పే విషయం. ఇక అసెంబ్లీలో చంద్రబాబుని ఎలా హేళన చేసారో, చూసాం. టిఎంసీ అంటే తెలియని వాడు కూడా, ఆయనకు ఇరిగేషన్ పాఠాలు చెప్పే వారే. అవినీతి చేసే వారు, ఆయనకు అవినీతి గురించి పాఠాలు చెప్పే వారే. ప్రజా తీర్పును శిరసావహిస్తూ, మౌనంగా ఉంటూ, అన్నీ భరించటం తప్ప, చేసేది ఏమి లేదు.
ఇక నిన్న జగన్ తీసుకున్న నిర్ణయం అయితే తమిళనాడు కక్ష పూరిత రాజకీయాలను గుర్తు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను అక్రమ కట్టడం అంటూ దాన్ని కూల్చి వేయాలని జగన్ ఆదేశించారు. అయితే ప్రభుత్వ కట్టడాన్ని కూల్చివేయటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇది కేవలం కక్ష సాధింపు వ్యవహరామే అని అంటున్నారు. ఇక ఈ రోజు, ఏపి ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి, చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరికీ భద్రత తీసివేసింది. ఈ రోజు విదేశాల నుంచి చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లో అడుగు పెట్టగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోకేష్ కు ఉన్న జెడ్ క్యాటగిరీ భద్రత తొలగించి, సాధారణంగా అందరికీ ఇచ్చినట్టు 2+2 ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులకు పూర్తిగా తొలగించారు. అయితే ఈ విషయం పై టిడిపి శ్రేణులు ఆందోళన్ చెందుతున్నాయి. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా చెయ్యటం దారుణం అని అంటున్నారు. గతంలో మేము అధికారంలో ఉండగా, రాజకీయాలు ఎన్ని ఉన్నా, భద్రత విషయంలో మాత్రం, జగన్ కు ఆయన కుటుంబానికి ఎప్పుడూ ఇలా చెయ్యలేదని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు.