ఏప్రిల్ 20న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 68వ ఏట అడుగుపెట్టబోతున్నారు... అయితే, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు... అదే సమయంలో, ఢిల్లీ మోసాన్ని, దేశం మొత్తానికి తెలియచేసి, అందరూ మనకు మద్దతు పలికే విధంగా, ఆ రోజు చంద్రబాబు నిరాహార దీక్ష చెయ్యనున్నారు... మోడీ అరాచకాలకు నిరసనగా, ఈ నెల 20న, నిరాహారదీక్ష చేసే సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు... సహజంగా, ముఖ్యమంత్రి, ప్రధాని పై నిరసన తెలుపుతూ, దీక్ష చెయ్యటం చాలా అరుదు... ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలా నిరసన దీక్ష చేసారు...
ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో రాజీపడబోమని స్పష్టంచేశారు. విభజన హామీల సాధన కోసం ఈ నెల 20న ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలం శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే అంబేడ్కర్ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈనెల 20న నా పుట్టినరోజు..సాయంత్రం వరకు దీక్ష చేస్తా. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కేంద్రం లాలూచీ, ముసుగు రాజకీయాలు చేస్తోంది. నన్ను విమర్శించే అర్హత బీజేపీ, వైసీపీకి లేదు. కొత్తగా వచ్చిన ఓ పార్టీ కూడా మాపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనే బంద్‌కు పిలుపునిచ్చారు. అభివృద్ధికి విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేద్దాం. కేంద్రంపై రాజీలేని పోరాటానికి ప్రజలు సహకరించాలి. రాజకీయాల్లో మోదీ నాకంటే జూనియర్. 1995లోనే నేను సీఎం అయ్యా..2002లో మోదీ సీఎం అయ్యారు. 25 మంది ఎంపీలున్న రాష్ట్రాన్ని బీజేపీ కాదనుకుంటోంది. 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఢిల్లీని శాసించేది మనమే’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.