రాష్ట్రంలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒకాయన వచ్చి మళ్లీ పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇంకొకాయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్‌కు పోయే పరిస్థితికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా’ అని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ‘నేను నీ కోసం పనిచేయాలా.. వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా’ అని చంద్రబాబు అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలే మిన్న అనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తంచేశారు.
అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని తేల్చిచెప్పారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సీజన్ కావడంతో కొందరు స్వప్రయోజనాలకోసం రానున్న రోజుల్లో పార్టీలు మారడం సహజమేననే అభిప్రాయం తెదేపా నేతల్లో వ్యక్తమవుతోంది. అవంతి శ్రీనివాస్ విషయానికి కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే అభిప్రాయానికి తెదేపా అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల్లో పార్టీ బలంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తమను తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయనే పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.