ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రం పై స్వరం పెంచారు... ప్రజల ఆందోళనను, 5 కోట్ల మంది ప్రజల గొంతును వినిపించారు... గురువారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ విభజన హామీలు సకాలంలో అమలైతే ఏపీ మరింత అభివృద్ధి జరిగేదని అన్నారు... ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. హోదా కంటే ఎక్కువ ప్రయోజనలు ప్యాకేజీ ద్వారా ఇస్తామని ఆనాడు అరుణ్ జైట్లి ప్రకటించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు...
ప్రత్యేకహోదా వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని, ఏపీకి జరిగిన నష్టం చాలా ఎక్కువని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడగకుండా కొన్ని పార్టీలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సాకుతో సంక్షేమ పథకాలను ఆపబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని, మన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలు సరిగా లేకపోతే పెట్టుబడులు రావని, శాంతియుతంగా ఆందోళనలు చెయ్యాలని చంద్రబాబు సూచించారు.
ప్రత్యేకహోదా ఆందోళనల సాకుతో కొంతమంది గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడంపై కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా తనను తిడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్ని పార్టీల నేతలు నిద్రలేచినప్పటి నుంచి తనను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు. 'ఒక న్యూస్ పేపరుందీ.. ఆ పేపరు పేరు నేను చెప్పలేను మీకే తెలుసు.. అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు.. ఆ పేపరుని ఎవరైనా నమ్ముతారా?' అని ప్రశ్నించారు.