జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో అడుగు పెడుతూ, పెట్టిన మొదటి సంతకం, ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.10వేలు చేస్తున్నామని. అయితే ఇలా పెంచి, దీని పై ఎన్నో ఆంక్షలు పెట్టారు. గ్రేడింగ్ విధానం అంటూ, ఆశా వార్కర్లకు నెత్తి మీద పిడుగు వేసారు. అయితే దీని పై, ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమకు పెంచిన జీతం, బకాయలు వెంటనే చెల్లించాలని ఆశావర్కర్లు ఆందోళ నిర్వహించారు. ఈ రోజు ఛలో విజయవాడ పిలుపుతో, విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ఉన్న ధర్నా చౌక్ కు భారీ సంఖ్యలో ఆశావర్కర్లు చేరుకుని ఆందోళన చేసారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని, అలాగే తమకు కనీస వేతనం రూ.10వేలు వెంటనే ఇవ్వాలని, గ్రేడింగ్ విధానం ఎత్తేయాలంటూ ఆశా వర్కర్లు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
మరో పక్క ఛలో విజయవాడకు వెళుతున్న ఆశా వర్కర్లను రాష్ట్రంలో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల ఆశా వర్కర్లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొంత మందిని అరెస్ట్ చేసారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను, ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసారు. అయితే ఈ రోజు ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన, ప్రభుత్వం వారిని పెడుతున్న ఇబ్బందులు, అలాగే ఆశా వర్కర్లు అరెస్ట్ ల పై, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆశా వర్కర్లను నమ్మించి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతి సందర్భంలో, ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉందని చంద్రబాబు అన్నారు. ఆశా వర్కర్లకు జీతం పెంచామని ఫోటోలకు ఫోజ్లు ఇచ్చి, ఇప్పుడు గ్రేడింగ్ విధానం అంటూ, వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ‘‘ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! ఆశా వర్కర్లకు రూ.10 వేల జీతం పెంచేసాం అంటూ ఫోటోలకు ఫోజులా? మరో పక్క ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా? వాళ్ళ కష్టానికి గ్రేడ్ లు ఏంటి? చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారు? ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా? అంటే వాళ్ళను మీ ఇష్టానుసారం వేధించాలనేగా? ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.10 వేల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి. ఒక వేళ మీకు ఇవ్వాలని లేకపోతే మీ ఆయుధం సిద్ధంగానే ఉందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక్క ఫోన్ కొట్టండి మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి. ఆందోళన చేస్తున్న ఆశాకార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథ సృష్టిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా మీకిది మామూలే కదా!"