ఎవరి మీద తొందరగా నోరు జారకుండా, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చంద్రబాబు, తన సహజ శైలికి భిన్నంగా, నాయకుల పై ఫైర్ అయ్యారు... పత్రికలకు ఎక్కి తన్నుకు చావద్దు అంటూ ఒకింత కఠినంగానే వాయించారు. నిన్న అమరావతిలో, కడప పార్లమెంట్ నేతలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా కడపలో, తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న వర్గ పోరు గురించి ప్రస్తావన రాగానే, చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. నేను ఒక పధ్ధతి ప్రకారం, అన్ని పనులు చేసుకుంటూ వస్తుంటే, మీరు దాన్ని చెడగోట్టటమే పనిగా పెట్టుకున్నారు అంటూ అందుకున్నారు. ఇంత మంది ఉన్నా వేస్టే. ఇది మంచిపద్ధతి కాదు. ఎంతో కష్టపడాల్సిన సమయంలో ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగి పార్టీ పరువు తీస్తుంటే చూస్తుంటారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు ఎందుకు ఉండేది. తిని కూర్చునేందుకా? ఇది మంచిపద్ధతి కాదు అంటూ సీఎం సీరియస్ అయ్యారు.
కలిసి పని చేయకపోతే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవు.... పత్రికలకు ఎక్కి తన్నుకు చావద్దు... ఒకరిద్దరిని వదలుకోడానికి సిద్ధమే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పని చేశారు. ఇప్పుడు మీకేమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు కడప జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కడప జిల్లాలో చేపడుతున్నాం. కలిసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన వారే పత్రికలకు ఎక్కి పరువు తీస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలి తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడంతో మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఏమైంది మీకు? ఎన్నికల ముందు విభేదాలు సృష్టించుకుంటే ప్రజలు నమ్ముతారా? నెంబర్ వన్ స్థానంలో కడప జిల్లా ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. నాయకులు చేసే చిన్న చిన్న పొరపాట్లకు పార్టీ నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక సహించేది లేదంటూ ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డిని ఏమి చేస్తున్నారంటూ సీఎం ప్రశ్నించారు.
నిధులు ఎంత అవసరమో అంతా ఇచ్చాం. పదవులు ఇచ్చాం. అన్ని ఇచ్చినా సమన్వయంతో లేకపోవడంతో విభేదాలతో పత్రికలకు ఎక్కి తన్నుకుంటున్నారు. ఇక ఇలాంటివి పునావృతం కాకూడదు. కడపలో ఓ పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హార్టికల్చర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు అన్ని రీతుల్లో చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అందరూ కోఆర్డినేషన్‌తో పనిచేయాలి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కార్యకర్తల విషయంలో వివక్ష ఉండకూడదు. ఈ బాధ్యతను ఇన్చార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడులు పర్యవేక్షించాలి. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ కష్టపడి పని చేయాలి. మంచి ఫలితాలే రాబట్టాలి. ఇప్పటి నుంచే విధి విధానాలతో ముందుకు నడవాలి అంటూ నేతలకు సీఎం క్లాస్‌పీకారు.