ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రోడ్‌షోలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నానిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ‘ఎక్కడ పుట్టాడు ఈయన, ఎక్కడ పెరిగాడు ఈయన, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు ఈయన’ అని కొడాని నాని టీడీపీలో ఎదిగిన క్రమాన్ని చంద్రబాబు గుడివాడ సభలో గుర్తుచేశారు. ‘పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా, కాదా’ అని కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాటలు పెద్దపెద్దగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని కొడాలిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలులేదని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మామూలప్పుడు కనపడని, ఎలక్షన్స్ అప్పుడు మూటలతో వస్తాడని.. ఆ మూటలతో ఓట్లు కొంటాడని చంద్రబాబు కొడాని నానిపై విమర్శలు చేశారు. దేవినేని అవినాష్ ఇక్కడే ఉంటానని ఇల్లు కూడా కొనుక్కున్నాడని చెప్పారు. వెంట ఉండే దేవినేని అవినాష్‌ను గెలిపించుకోవాలని ఓటర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అధికారంలో వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ వస్తే అమరావతిలో ఎవరూ పెట్టుబడులు పెట్టరన్నారు. జగన్‌ను చూస్తే పారిశ్రామిక వేత్తలు పారిపోతారని విమర్శించారు. కేసీఆర్‌తో జగన్ కలవడం క్షమించరాని నేరమని చెప్పారు. మనల్ని దున్నపోతులు.. కుక్కలు అన్నారని.. ఆంధ్రావారిని ఛీకొట్టారని కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. అలాంటి వారితో జగన్ కలిసివెళ్తున్నారని ఆరోపించారు.
ఏపీకి అన్యాయం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని వివరించారు. బంగారు బాతు లాంటి హైదరాబాద్‌ను అనుభవిస్తూ కేసీఆర్ మనల్ని తిడుతున్నారని మండిపడ్డారు. కేసుల కోసం కేసీఆర్‌తో జగన్ రాజీపడ్డారన్నారు. సొంత బాబాయి హత్యకు గురైతే గుండెపోటు అని డ్రామాలాడారంటూ ధ్వజమెత్తారు. అయినా మనపై తెలంగాణ పెత్తనం ఏంటి?, మీకు రోషం ఉందా లేదా?, మోదీ మోసం చేశాడా లేదా? అని ప్రశ్నించారు. మోదీ మనపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలు అని హెచ్చరించారు. మాపై దాడులు చేసి మీరు గెలవలేరన్నారు. రాష్ట్రానికి ప్రజలు కవచంలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తాను ఐదేళ్లు అహర్నిశలు కష్టపడింది ఎవరి కోసమని అడిగారు. సంక్షేమ పథకాలు తెచ్చింది ఎవరి కోసమని ప్రశ్నించారు. మీరంతా తనకు వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. టీడీపీకి ఓటు వేయకుంటే తాను ఎవరి కోసం కష్టపడినట్లని ప్రశ్నించారు. అందుకోసమే తనకు మరో అవకాశం ఇవ్వాలన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలతో భవిష్యత్‌ను మార్చుకుందామని విన్నవించారు.