ఈయన ఎప్పుడూ మాటలే చెప్తాడు, ఏమి చేస్తాడులే, నాలుగు తిడతాడు, అంతకు మించి ఏమి ఉంటుంది అనుకున్నారో ఏమో, నిన్న జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో తోక జాడించిన నేతల పై, చంద్రబాబు ఫైర్ చూసి, అందరూ షాక్ అయ్యారు. సీనియర్ నేతలను కూడా వాయించి పడేసారు. ఒక పక్క అన్ని వైపుల నుంచి, అందరూ టార్గెట్ చేస్తుంటే, ఎవరూ ఏదీ పట్టనట్టు, ఎవరి పని వారు చూసుకోవటం పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ పరిస్థితిగా భావించి పార్టీలోని ప్రతి ఒక్కరూ ఎన్నికలయ్యేంత వరకూ కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. రాబోయే 6 నెలల్లో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని, తనతో సహా ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదులో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ నాయకులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn 22122018 2

పార్టీ నేతల అలసత్వంపై చంద్రబాబు గతంలో మున్నెన్నడూ లేని స్థాయిలో మండిపడ్డారు. ఆయన కోపం చూసి ఆ పార్టీ నేతలు వణికిపోయారు. ఈ భేటీకి జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ జిల్లా కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాల్గొనాల్సి ఉంది. కానీ, కొన్ని జిల్లాల్లో నేతల హాజరు పలుచగా ఉండడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. అలాగే సభ్యత్వ నమోదు కొన్ని నియోజకవర్గాల్లో మందకొడిగా జరగడంతో నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘పార్టీ సమావేశాలంటే తమాషాగా ఉందా? నాకు పనిలేక పెడుతున్నానా? బాధపడతారని సంయమనం పాటిస్తుంటే అలుసుగా తీసుకుంటున్నారా? మీ వల్ల నేను ప్రజల్లో బలహీనపడుతున్నాను. మీరు చేసే తప్పులకు పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇక చూస్తూ ఊరుకోను. మిమ్మల్ని గట్టిగా మందలిస్తే ప్రజలు నన్నయినా హర్షిస్తారు. నేను బలపడతాను. మీరు ఏమనుకున్నా వచ్చే 6నెలలూ కఠినంగానే ఉంటాను. కఠినంగానే మాట్లాడతాను’’ అని ఆయన తేల్చిచెప్పారు.

cbn 22122018 3

గుంటూరు జిల్లా నేతల హాజరు బలహీనంగా ఉండడంతో సీఎం సీరియస్‌ అయ్యారు. ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు సమావేశానికి రాకపోవడంతో మండిపడ్డారు. ‘గుంటూరు జిల్లా నేతలకు అతి విశ్వాసం ఎక్కువగా ఉంది. బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. సమయం లేదని సాకులు చెబుతున్నారు. నాకు దొరుకుతున్న సమయం మీకెందుకు దొరకడం లేదు? మీ తీరు చూసి ఫ్రస్ట్రేషన్‌ వస్తోంది. ప్రయత్నం లేకుండా ఏ పనీ కాదు. పని చేయకుండా గెలవలేరు’ అని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వచ్చారా అని వాకబు చేసినప్పుడు రాలేదని పార్టీ నేతలు చెప్పారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి సిద్ధా రాఘవరావు ఆకాశంలో తిరుగుతున్నారని, నేల మీదకు రావడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీలో సమన్వయం కనిపించడం లేదు. అతి విశ్వాసం పెరిగింది. ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఒక మాట చెబితే దానిని నిలుపుకొనేలా పనిచేయాలి. నేను పదేపదే మీ వెంట పడే పరిస్థితి ఉండకూడదు’ అని హితవు చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కూడా ఈ సందర్భంగా అక్షింతలు పడ్డాయి. ఆయన వరుసగా పలుమార్లు సమావేశాలకు గైర్హాజరు కావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశా రు. ‘సీనియర్లు కూ డా పదేపదే చెప్పించుకోవడం సరికాదు. పని చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమని గుర్తించాలి’ అని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాలని, పార్టీని మోసం చేయవద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. జిల్లాలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో సైతం మంత్రి సరిగ్గా పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పనులుంటే 2019 జరిగే ఎన్నికలను వాయిదా వేయబోరని చురకలు అంటించారు. ‘‘నాయకుల్లో అతి విశ్వాసం, అతిశయం, అహంభావం ఉండరాదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. అన్ని నివేదికలను బేరీజు వేసుకుంటున్నాను. సరైన వ్యక్తులనే సరైన స్థానంలో పెడతాను!’’ అని చంద్రబాబు నర్మగర్భ హెచ్చరికలు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read