ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జనసేనతో పొత్తులపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాము-ముంగీసలా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ- జనసేన పొత్తు తప్పుకాదని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీజీ ప్రకటన సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు.
ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉందని వెంకటేష్ చెప్పారు. ఇటీవల టీడీపీతో జనసేన కలుస్తుందన్న వార్తలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు స్పందించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం, కేంద్రంతో పోరాటం కోసం, తమతో పవన్ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్ కాదని, నేరస్ధుడని మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే కేసులు నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ప్రతిపక్ష నేత ఆలోచన అని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్‌లు కలిసి ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.
అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మోడీ పై పోరాటానికి కలిసి రాలేదు. చంద్రబాబు పదే పదే, పవన్ చెప్పిన ఫాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ పై స్పందించి, మోడీ పై పోరాటం చెయ్యమని కోరినా, గత సంవత్సర కాలం నుంచి, పవన్ కళ్యాణ్, మోడీ పై మౌనంగానే ఉన్నారు.మొన్నటి దాకా కేసీఆర్ భజన చేసిన పవన్, కేసీఆర్ తనను కరివేపాకు లాగా పక్కన పడేసి, జగన్ ను దగ్గర తియ్యటంతో, పవన్ ఇగో దెబ్బతింది. దీంతో, మొన్న మొదటి సారి, కేసీఆర్, జగన్ కలయిక పై విమర్శలు చేసారు పవన్. ఇప్పటి వరకు మోడీ పై పోరాటం లేదు, కేసీఆర్ మనలను అవమానించిన దాని పై పోరాటం లేదు, అలా టైం పాస్ చేస్తున్న పవన్, ఇప్పటికైనా, ఒక నిర్ణయం తీసుకొంటారో, మోడీ భక్తుడిగానే మిగిలిపోతారో చూడాలి..