ధనిక రాష్ట్రాలకు మించి అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తత పాటిస్తూ ప్రభుత్వానికి అండగా ఉండకపోతే మళ్లీ అరాచక శక్తులు విజృంభించి చీకటి రోజులు తెస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధిని కొందరు అదే పనిగా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రత్యేక హోదా మన హక్కు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఆ హోదా ఇవ్వాలన్న కేసీఆర్, ఇప్పుడు మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి అడ్డుపడుతున్నారు. అలాంటి వ్యక్తిని జగన్, పవన్‌లు ఆకాశానికెత్తేస్తున్నారు. వారి ఉద్దేశాల్ని ప్రజలే గ్రహించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ఉండవల్లి నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. ‘‘ఒక పరిశ్రమ రావాలంటే ఎంతో శ్రమపడాలి. చెడగొట్టడం చాలా సులభం. కొంతమంది అభివృద్ధి నిరోధకులు పరిశ్రమలు రాకుండా, అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వారిపట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడు జనార్దన్‌రెడ్డి సిమెంటు పరిశ్రమ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరారని, ప్రక్రియ కొలిక్కి వచ్చేదాకా పట్టుబట్టి సాధించారని, మిగతా వారూ అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడుల్ని తెచ్చే 2,632 పరిశ్రమల్ని ఈ నాలుగున్నరేళ్లలో ఆకర్షించామని, తద్వారా 33,03,671 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘వీటిలో రూ.6,30,457 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుచేస్తున్న 1,695 పరిశ్రమలు ఉత్పత్తి నుంచి అనుమతుల వరకు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 299 యూనిట్లు భూకేటాయింపు, 638 పరిశ్రమలు డీపీఆర్ దశల్లో ఉన్నాయి. ప్రారంభించిన పరిశ్రమల్లో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రానికి ఏం ఒరిగిందని మాట్లాడే విపక్షానికి ఇదే సమాధానం’’ అని ఆయన తెలిపారు.