ఈ రోజు ఢిల్లీలో, దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై నేడు జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగిన సమావేశంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానం పై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీకి ఏపీ మంత్రి దేవినేని ఉమా కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో, దేశంలోనే మొట్టమొదటి సారి, నదుల అనుసంధానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబుని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉమా విలేకరులతో మాట్లాడుతూ, గోదావరి-కావేరి అనుసంధానానికి ముందు నీటి లభ్యత లెక్కించాలని, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరామన్నారు. పోలవరానికి కేంద్రం రూ.2700 కోట్లు రీయింబర్స్ మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం కలను మొదటి సారిగా సాకారం చేసిన చంద్రబాబు విధానాలని మేచ్చుకున్నట్టు చెప్పారు.
గోదారమ్మ, కృష్ణమ్మ ను అనుసంధానం చేసి, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నీటిని మళ్ళించి, డెల్టా రైతులకు; అటు శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వాలి అన్న చంద్రబాబు ఆశయం నెరవేరి, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ గా పట్టిసీమ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఎందరో నదులు అనుసంధానం చెయ్యాలి అని కలలు కన్నారు, కాని చంద్రబాబు నిజం చేసి చూపించారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్, గత మూడు సంవత్సరాలు నుంచి మంచి ఫలితాన్నే ఇచ్చింది. రాష్ట్ర రైతులని ఆదుకోవటానికి, ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు ముందుకు వెళ్లారు. ఒక పక్క కృష్ణా నదికి వచ్చే నీరు తగ్గిపోవటం, ఎగువ రాష్ట్రాల పేచిలతో, కృష్ణా నది నీటి కేటాయింపులు బాగా తగ్గిపోయిన నేపధ్యంలో, పట్టిసీమ ఒక సంజీవినిలా వచ్చి రైతులని ఆదుకుంది.
అయితే, ఇప్పుడు నదుల అనుసంధానాన్ని కేంద్ర జల సంఘం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు పట్టిసీమ ఎత్తిపోతలను నమూనాగా ఎంచుకుంది. రాష్ట్రాల మధ్య నదులను అనుసంధానం చెయ్యటానికి, ఆయా రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ లోని పట్టిసీమ తరహాలో, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతర్గత అనుసంధానంపై తొలుత దృష్టి సారిస్తే కొంత ఫలితం వస్తుందని కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ భావిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర జల సంఘానికి చెందిన ఒక ఒక బృందం ఈ కసరత్తులో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించింది.