ఐదేళ్ల కిందట అన్యాయంగా జరిగిన విభజన కారణంగా కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని.. తనపై నమ్మకంతో పసిబిడ్డలాంటి రాష్ట్రాన్ని ప్రజలు తనకు అప్పజెప్పారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని గత ఐదేళ్లు కష్టపడ్డానని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. విభజన హామీలు నెరవేర్చాల్సిన కేంద్రం నమ్మకద్రోహం చేసిందని.. ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో మనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డం తిరిగిందని ఆరోపించారు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు నడిచానని చెప్పారు. అవినీతితో సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్ర ద్రోహులతో కొందరు చేతులు కలిపారన్నారు.
మన సాగునీటి ప్రాజెక్టులకి అడ్డుపడి అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు సిద్ధపడిన ఆ అనుభవం లేని నాయకుడిని నమ్మి రాష్ట్రాన్ని అప్ప చెబుదామా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ కథను లేఖలో ఆయన ప్రస్తావించారు. ‘‘ఒకసారి అడవిలో నాయకత్వానికి సెలయేరు, గొడ్డలి పోటీ పడ్డాయట. అందరి సంక్షేమాన్ని చూసే సెలయేరు కావాలా? చెట్లన్నీ అడ్డంగా నరికే గొడ్డలి కావాలా? అనే మీమాంస ఏర్పడింది. కొన్ని చెట్లు గొడ్డలి కర్రది మన కులం కదా.. నాయకుడిగా పెట్టుకుంటే తప్పేంటి అనుకున్నాయట. ఆ చెట్ల మాటలను మరో చెట్టు మీద నుంచి ఆసక్తిగా వింటున్న కుందేలు మధ్యలో కలగజేసుకుంది."
"మన మధ్య ఏ భేదం చూపకుండా అందరి సంక్షేమమే తన కులం అని భావించి సేవచేసే సెలయేటిని వదిలి.. అడ్డంగా నరికే గొడ్డలి కర్రను మీ కులమని ఓటేస్తే చెట్లన్నింటినీ నరికేసి చివరికి అడవి అంతరించిపోతే మన భవిష్యత్తు ఏం కాను? అని ప్రశ్నించిందట. దాంతో అడవిలో చెట్లన్నింటికీ జ్ఞానోదయమై చెట్లన్నీ పచ్చగా ఉండాలంటే మన నాయకుడిగా సెలయేరు ఉండాలని ఎన్నుకున్నాయట’’ అడవిలో చెట్లన్నింటికీ బాధ్యతను గుర్తు చేసిన ఆ కుందేలు మాటలు మన అందరికీ ఆదర్శం కావాలి అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.