గుంటూరు హైలెవెల్ ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు అంశంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మొదటి దశ సర్వే పనులకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నల్లమడ రైతు సంఘం నేతలు డా. కొల్లా రాజమోహన్, యార్లగడ్డ అంకమ్మ చౌదరి నేతృత్వంలో రైతాంగ ప్రతినిధులు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసి గుంటూరు హైలెవల్ ఛానెల్ పొడిగింపు ఆవశ్యకతను వివరించగా సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న ఉద్దేశంతోనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

cbn 1904208

సాగునీరు లేదని, నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని అనే మాటలు ఇకపై వినపడవని, వాటర్ గ్రిడ్ పనులు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడ నీరు అవసరమైతే అక్కడికి పంపిస్తామని, అటువంటి దార్శనికతతో తాము స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాధాన్య క్రమంలో 29 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని, జూన్ నుంచి వరుసగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించి రైతాంగానికి అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గుంటూరు హైలెవల్ ఛానల్ విస్తరణ ఆవశ్యకతను పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రికి వివరించారు.

cbn 1904208

అంతకు ముందు నల్లమడ రైతు సంఘ ప్రతినిధులు డా. కొల్లా రాజమోహన్, యార్లగడ్డ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ గుంటూరు ఛానెల్ యామర్తి దగ్గర నిలిచిపోయిందని, ఈ ఛానెల్ కాల్వ పనులను ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడింగించాలని, తర్వాత ఇంకొల్లుకు విస్తరించవచ్చని ముఖ్యమంత్రికి వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమి సాగు అవుతుందని, రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, చిలకలూరిపేట మండలాల్లో కొంత భాగంలో భూగర్భ జలాలు అడుగంటాయని, ఉన్న నీరు కూడా ఉప్పునీరేనని తెలిపారు.

cbn 1904208

గుంటూరు ఛానెల్ పొడిగింపు వల్ల కనీసం ముందుగా 50 గ్రామాలకు సాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేందుకు తక్షణం వీలు కలుగుతుందని రైతాంగ ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల, వాటర్ గ్రిడ్ వల్ల నీటికి కొరత లేదని, అందువల్ల పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, పర్చూరు వరకూ సరిపడా జలాలను ఇవ్వవచ్న్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా పైప్ లైన్ వేసి, కాల్వను ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేస్తే 50 వేల ఎకరాలను తక్షణం సాగులోకి తేవచ్చన్నారు. గుంటూరు ఛానెల్ ను ప్రకాశం జిల్లాకు తొలుత పర్చూరుకు, తర్వాత ఇంకొల్లుకు పొడిగించడం వల్ల ప్రత్తి, మిరప, పసుపు లాంటి వాణిజ్యపంటలను, ఆరుతడి పంటలను వేయవచ్చని తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్‌కు వినతిపత్రం సమర్పించగా సానుకూల స్పందన వ్యక్తం చేశారని, తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.

cbn 1904208

గతంలో గుంటూరు ఛానెల్ పొడిగింపు అంశంపై చీఫ్ ఇంజనీర్ వెంకటేశన్ సర్వే చేశారని, తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. 1953 నుంచి 1967 వరకు పార్లమెంటు సభ్యులు తరిమెల నాగిరెడ్డి, ఎస్వీఎల్ నరసింహం, కడియాల గోపాలరావు, మాదల నారాయణ స్వామి, కొల్లా వెంకయ్యలు పెదనందిపాడు హైలెవెల్ ఛానెల్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించారని, ఉమ్మడి రాష్ట్ర శాసన సభలో ఎమ్మెల్యేలు వావిలాల గోపాల కృష్ణయ్య, మంతెన వెంకటరాజు, గౌతు లచ్చన్న, నరహరిశెట్టి వెంకట స్వామి, కొరటాల సత్యనారాయణ, మద్దుకూరి నారాయణ తదితరులు అసెంబ్లీలో తమ వాణి వినిపించాచని నల్లమడ రైతు సంఘ నేతలు, రైతాంగ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

తాము దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశామని అన్నారు. ఈ ప్రాంతానికి నీరువస్తే పొగాకు పంట వేయడానికి వీలుకాదన్నది అపోహ మాత్రమేనని, పొగాకు పంటకు కూడా 3 తడులు అవసరమని తెలిపారు. కృష్ణా నదికి 60 కి.మీ దూరంలో ఉన్న తమ ప్రాంతానికి గతంలో కృష్ణా జలాలు రాకుండా చేశారని,నల్లమడ వాగులోకి వచ్చే మురుగునీటిపై ఆధారపడి పంటలు వేస్తున్నామన్నారు. ఒకవైపు డెల్టా, మరోవైపు నాగార్జున సాగర్ ఆయకట్టు భూములున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన రైతు సంఘ ప్రతినిధి బృందంలో కుర్రా హరిబాబు, మొవ్వా పెద్దన్న, నర్రా బాలకృష్ణ, ప్రత్తిపాటి రవీంద్ర ప్రసాద్, విక్రయాల సుబ్బారావు,డి. కోటేశ్వరరావు తదితరులున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read