గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి కష్టాలను దృష్టిలో ఉంచుకునే వేతనాలు రూ.6,565 నుంచి రూ.10,500కు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం సాయంత్రం వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏలు ముఖ్యమంత్రిని ఉండవల్లిలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే వీఆర్‌ఏల వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.6,565కు, నాలుగేళ్లలో మూడింతలు పెంచామని తెలిపారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తున్నామని వివరించారు. ఇదే స్ఫూర్తితో వీఆర్‌ఏలు గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ‘ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రధాని అమరావతి అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రవాసులకూ మంచి ప్రేరణనిస్తోంది. అందువల్లే నవ నిర్మాణ దీక్షలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగాలి’ అని సీఎం తెలిపారు.
వేతనాలు పెంచినందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏల సంఘ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు కైకాల గోపాలరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ చౌదరి, టి.వెంకటేశ్వర్లు ఉన్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 27వేల మంది వీఆర్‌ఏల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వారి కుటుంబాల్లో ఆనందం నింపుతోందని రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.