కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశంలో విపక్షాల ఐక్యతకు మరింత ఊతం ఇవ్వనున్నాయి. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో- బళ్లారిని భాజపా నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకొంది. మిగిలిన అన్ని స్థానాలను ఎవరివి వారు నిలబెట్టుకున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మెజార్టీల్లో భారీ తేడా రావడం విపక్షాల బలాన్ని చాటుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఇలాగే మిత్రపక్షాలన్నీ కలిసికట్టుగా జయకేతనం ఎగరవేసి భాజపాను పెద్ద దెబ్బకొట్టాయి. బద్ధ శత్రువులైన బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ ఆ ఎన్నికల్లో కలిసి పోటీచేసి భాజపాను ఓడించడం దేశ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆగర్భ వైరాన్ని పక్కనపెట్టి కలవడం ద్వారా ఎంత పెద్ద శత్రువునైనా ఎదుర్కోవచ్చన్న ధైర్యాన్ని విపక్షాల్లో ఉప ఎన్నికలు నింపాయి.
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఏకమై రాష్ట్రంలో భాజపాను అధికారానికి దూరం చేయగలిగిన తర్వాత విపక్షాల ఏకీకరణ పై దేశవ్యాప్తంగా చర్చ విస్తృతమైంది. 2017 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 312 సీట్లు గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలోని విపక్షాలన్నీ తమ పని అయిపోయిందని జావగారాయి. ఇక ప్రతిపక్షాలకు భవిష్యత్తు ఉండదేమోనన్న వాతావరణం అలుముకొంది. కానీ ఈ ఏడాది మార్చి 11న జరిగిన గోరఖ్‌పూర్, పూల్‌పుర్ లోక్‌సభ ఉప ఎన్నికలను సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసికట్టుగా ఎదుర్కొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిథ్యం వహించిన స్థానాలను కైవశం చేసుకోవడం సంచలనం రేపింది. ఆ రెండు ఎన్నికలు దేశంలో రాజకీయ పునరేకీకరణకు దారి చూపాయి. కైరానా ఉప ఎన్నిక మరింత బలాన్ని చేకూర్చగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు ఆ పంథా సరైనదేనని ధ్రువీకరించినట్లయింది.
దేశంలోని మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసిన విషయం తెలిసిందే. తాజా ఫలితాలు ఆ ప్రయత్నాలకు మరింత ఊతాన్ని ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భావసారూప్య పార్టీలను కూడగట్టే పనిని చంద్రబాబునాయుడు మరింత మనోధైర్యంతో చేయడానికి వీలు కలిగిందని ఆ పార్టీ ఎంపీలు పేర్కొన్నారు. ఒకనాటి మిత్రపక్షమైన శివసేనతో ప్రస్తుతం భాజపాకు పొసగడం లేదు. బిహార్‌లో జేడీ(యూ)తో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ రాష్ట్రీయ లోక్ సమత, లోక్ జన్‌శక్తి పార్టీలతో ఇంకా లుకలుకలు నడుస్తున్నాయి. తగిన సీట్లు లభించకపోతే ఆ రెండు పార్టీలు బిహార్‌లో ప్రధాన పార్టీ అయిన ఆర్‌జేడీతో జట్టు కట్టడానికి వెనుకాడబోవన్న వాదన ఉంది. తాజా ఫలితాలతో 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్) కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగడం దాదాపు ఖాయమే. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌తో, ఒడిశాలో బీజేడీతో కాంగ్రెస్‌కు అవగాహనపై ఇంతవరకు ఎలాంటి సంకేతాలు లేకపోయినా కర్ణాటక అనుభవంతో ఆ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేయబోతుందనేది స్పష్టం. అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పొత్తుల ఎత్తుల్లో మరింత స్పష్టత రానుంది. యూపీలో బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్ మధ్య పొత్తు విషయం డిసెంబరు 11 ఫలితాల తర్వాత ఖరారు కానుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 156 లోక్‌సభ స్థానాలున్నాయి.