ఫొని తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, సహాయక చర్యలపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సీఎస్ సుబ్రహ్మణ్యం గవర్నర్ నరసింహన్కు వివరించారు. ఇదిలా ఉండగా, ‘ఫణి’ తుపాన్ కారణంగా ఏపీలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది. తుపాన్ ప్రభావం బెంగాల్ పైనా ఉండనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్ కతా సహా పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఉత్తరాంధ్రకు ఫణి తుపాను ముప్పు తప్పింది. స్వల్ప నష్టం మాత్రమే ఉందని అధికారులు ప్రకటించారు. తుపాను కదలికలను ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు అంచనా వేసింది. తీరం దాటిన సందర్భంగా వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్ తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని స్పష్టంచేసింది. మరోవైపు 24 గంటల పాటు తుపాను గమనాన్ని అంచనా వేసి సీఎం చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేశారు. గాలులకు అరటి తోటలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే పంటనష్టం అంచనాలపై సాయంత్రం అధికారులతో మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అందరినీ ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఫణి తుపాను ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటిన సంగతి తెలిసిందే. పూరికి దక్షిణంగా ఫణి తుపాను తీరాన్ని దాటింది. తుపాను క్రమంగా బలహీనపడుతోంది. పూరిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. 200-240 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్ వెళ్లేలోపు తుపాను బలహీనపడనున్నది. ఆర్టీజీఎస్కు అభినందనల వెల్లువెత్తుతున్నాయి. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ అంచనా వేసింది. సమాచారాన్ని ఒడిశా ప్రభుత్వం, రైల్వేశాఖకు ఆర్టీజీఎస్ అందజేసింది. ఏపీ ప్రభుత్వం, ఆర్టీజీఎస్కు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఆర్టీజీఎస్ చాలా సమాచారం ఇచ్చిందని.. ఆ కారణంగానే ముందస్తు చర్యలు తీసుకోగలిగామని ఒడిశా ప్రభుత్వం పేర్కొన్నది. ఆర్టీజీఎస్ సమాచారం ఎంతో ఉపయోగపడిందని రైల్వే శాఖ కూడా తెలిపింది. ఆర్టీజీఎస్ సిబ్బందికి రైల్వేశాఖ ధన్యవాదాలు తెలిపింది.