రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లలో విద్యుత్ రంగంలో ఏపీ సాధించిన పురోగతి అసాధారణం, చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. ఇంధన శాఖ అధికారులతో ఆయన ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చార్జీలు పెంచకుండా ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్న తన కల సాకారమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. 2019-20 సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచకుండా వినియోగదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ఏపీఈఆర్సీని ఆయన అభినందించారు. చార్జీలు పెంచకపోవడం వల్ల 1.74 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. విద్యుత్ చార్జీల తగ్గింపు వల్ల 45లక్షల మంది వినియోగదారులకు కొంతమేర ఆర్థిక ప్రపయోజనాలు లభిస్తాయన్నారు.
పరిశ్రమలకు కూడా ఇలానే స్థిరమైన టారిఫ్, స్థిరమైన విద్యుత్ సరఫరాను శాశ్వతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగంలో సాధించిన అద్భుత పురోగతి గడచిన నాలుగేళ్లలో తమ ప్రభుత్వానికి దక్కిన ఘన విజయానికి నిదర్శమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజధాని లేకుండా, 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో ఏర్పడిన కొత్త రాష్ట్రం ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఇది అసాధారణమని, అత్యంత అద్భుతమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పీక్‌టైం, టైమ్ ఆఫ్ డే చార్జీలు తగ్గించిందని, వ్యవసాయాధారిత పరిశ్రమలకూ చార్జీలు తగ్గించామన్నారు. అత్యంత వెనుకబడిన కులాలు, స్వర్ణకారులు, ఎస్సీ, ఎస్టీలు, దోభీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లు, చెరకు క్రషింగ్ యూనిట్లు, గ్రామీణ నర్సరీలు, తదితర రంగాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు చేపట్టలేదని, రాష్ట్ర విద్యుత్ రంగం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక విద్యుత్ చార్జీలు పెంచలేదని, వీలైనంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయడం వంటి చర్యలు తీసుకొని, విద్యుత్ రంగాన్ని బరోపేతం చేయడమే లక్ష్యంగా రెండో తరం సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, 22 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఉండేదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి సారించానన్నారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు, ఇంధన నిల్వ, థర్మల్ విద్యుత్‌లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం వంటి చర్యలు చేపట్టానని వెల్లడించారు. ఈ చర్యలన్నింటి వల్ల తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను తగ్గించడం సాధ్యమైందన్నారు.