అరుదైన నరాల బలహీనతతో బాధపడుతున్న రోగి చికిత్సకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు రోగి అజయ్ కుమార్ ను అతని తల్లిదండ్రులు తీసుకొచ్చి కుమారుడి సమస్యను వివరించారు. అజయ్ కుమార్ ను వేధిస్తున్న తీవ్రమైన నరాల రోగ నివారణ ప్రక్రియలో చికిత్సకు అవసరమైన ఖర్చును మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారతను చాటుకున్నారు. అనంతపురం పట్టణంలోని వేణుగోపాల నగర్ కు చెందిన ఎన్నికపాటి శ్రీరాములు కుమారుడు అజయ్ కుమార్ చిన్నవయసులో బ్రైన్ ఫీవర్ మూలంగా తీవ్రమైన నరాల జబ్బున పడ్డాడు.
32 ఏళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం, కుడి చేయి మెలితిరిగి ఉండటం, మెడవాపు, బస్సు హారన్ శబ్దానికి నోటి నుంచి నాలుక బయటకు రావడం వంటి పలు ఇబ్బందులతో అజయ్ కుమార్ సతమతమవుతున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. నిద్రలోనూ ఉలిక్కపడి లేస్తూ అరుస్తూ మెలితిరిగి పోతూ శారీరక ఇబ్బందులతో బాధ పడుతున్నాడని వివరించారు. పిండిమర నడుపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న తనకు కుమారుడి చికిత్సకు ఖర్చు తలకుమించిన భారమైందని శ్రీరాములు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాడు. బెంగుళూరులో యాస్తర్ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి గోపాల్ వర్మ వద్ద అజయ్ కుమార్ వైద్య చికిత్స చేయిస్తున్నామని తెలిపారు.
విదేశాల ఉంచి తెప్పించి గుండె వద్ద యంత్రాన్ని అమరిస్తే మెలి తిరిగిన చేయి సాఫుగా వస్తుందని క్రమంగా రోగి కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. వైద్యచికిత్సకు రూ.17 లక్షల ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు వద్ద తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. ఇన్నాళ్ళూ పేదరికంలోనూ కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఉన్నంతలో చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. అజయ్ కుమార్ అనారోగ్యం గురించి సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ స్పందించి రూ. 15 లక్షలు మంజూరు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.