తిత్లీ తుపానుకు అతలాకుతలమైన పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రూపురేఖలు మార్చి విశాఖపట్నం మాదిరిగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ తుపాను సహాయ కార్యక్రమాలపై తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విజయానికి సంకేతం విజయదశమి అంటారని, అందుకే గురువారం నుంచే ఇక్కడ అభివృద్ధికి నాంది పలుకుతున్నానన్నారు. ‘సూర్యుడు ఉదయించే జిల్లా సిక్కోలు. జిల్లా అభివృద్ధి కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నా’ అని ప్రకటించారు.
‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరిగా.. కొబ్బరిచెట్టుకు రూ.1200, జీడిమామిడికి హెక్టార్‌కు రూ.25వేలు ప్రకటించాను. కాని అందరి కష్టాలు చూసిన తర్వాత కొబ్బరి చెట్టుకు రూ.1500, జీడిమామిడికి హెక్టారుకు రూ.30 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గీత కార్మికులకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం అందిస్తానని ఉద్దానంలో చెట్లు పడిపోతే తొలగించుకోటానికి చెట్టుకు రూ.300 చొప్పున అందిస్తామని ప్రకటించారు. బోర్లు వేసుకుంటామంటే ఉచితంగా వేసి విద్యుత్తు అందిస్తామని తెలిపారు. ఉద్దానాన్ని ఉద్యానవనంగా మార్పు చేసేందుకు అందరం కలసి కష్టపడదామని పిలుపునిచ్చారు.
నిత్యావసర సరకులను గులాబీ కార్డుదారులకు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఎంతగా పనిచేస్తుందో అంతే బాధ్యతగా కార్యకర్తలంతా తమ భుజస్కందాలపై భారం వేసుకొని సమన్వయంతో పనిచేయాలని ఉద్బోధించారు. తిత్లీ తుఫానుకు సంబంధించి నష్టపరిహారం చెక్కులను ఈ నెలాఖరులో 29 నుంచి 31 మధ్య బాధితులకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి అక్కడ అందరికీ ఒకేరోజున అందజేయాలని సూచించారు.