గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నీటి రాకను ఎప్పటికప్పుడు అంచనా వేసి, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ ఏర్పాట్లు చేయాలని, విపత్తుల నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే విశాఖ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు, మంగళగిరి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు విపత్తు నివారణ బృందాలు బయల్దేరినట్టు అధికారులు వివరించారు. వరద సమయంలో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధవళేశ్వరం దగ్గర రెండో హెచ్చరిక జారీ చేసే అవకాశమున్నందున అన్ని వేళలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలవరం నిర్మాణ ప్రాంతంలోను తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై ఆయన శుక్రవారం సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి అధికారులతో సమీక్షించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిలో ఒక్క చుక్క కూడా వృథాగా సముద్రంలోకి పోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత వరకు నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కృష్ణానదిలో వరద ప్రవాహంపైనా సీఎం ఆరాతీశారు. కృష్ణాకు వస్తున్న వరద నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, రాయలసీమలోని ప్రాజెక్టులకు మళ్లించి సద్వినియోగమయ్యేలా చూడాలని సూచించారు. ఈ నెలాఖరులోపు కృష్ణాలో 200 టీఎంసీల నీరు వచ్చే అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేశామని, మచ్చుమర్రికి కూడా మళ్లిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 9.3% లోటు వర్షపాతం నమోదైందని, అన్ని ప్రాజెక్టుల ద్వారా 968టీఎంసీలు నిల్వ చేయాల్సి ఉండగా, 441.71టీఎంసీలు నిల్వ చేసుకున్నామని చెప్పారు. కర్నూలులో 41.5%, అనంతపురంలో 39.9%, కడపలో 54.8%, నెల్లూరులో 51.9%, ప్రకాశంలో 33.2% తక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు.