రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 12 రాష్ట్రాలు కీలకం కానున్నాయి. అవి హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఒడిషా, మహారాష్ట్ర, యూపీ, బిహార్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక ఎందుకంటే ఇక్కడే గత ఎన్నికల్లో బహుముఖ పోటీలు జరిగాయి. అందంతా బీజేపీ విజయానికి కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు భుజాన వేసుకున్న బాధ్యత నెరవేరాలంటే ఈ రాష్ట్రల్లో బీజేపీ దాని మిత్రపక్షాలపై ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకుండా చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల మధ్య ఓట్ల బదిలీకావాల్సి ఉంటుంది. ఇందుకోసం చంద్రబాబు ప్రతిపక్షాలందరితో మాట్లాడి, ఒప్పించాల్సి ఉంటుంది. వారి మధ్య ఐక్యత సాధించాల్సి ఉంటుంది. ఇదేమంత తేలిక వ్యవహారం కాదు. ఎంతో చాకచక్యం అవసరం. ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్ పార్టీల మధ్య పొత్తు సాధ్యమని ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. అదే జరిగితే బీజేపీ గెలిచిన 70 స్థానాలకు చెక్ పెట్టొచ్చు.
బిహార్‌లో ఎలాగు ఆర్జేడీ, కాంగ్రెస్, ఎంసీపీ, జేడీయూ, శరత్ పవార్ వర్గం మధ్య పొత్తు సాధ్యంగానే ఉంది. ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌ను ఒప్పిస్తే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమవుతుంది. ఇందుకు కాంగ్రెస్ కూడా కలిసిరావాల్సి ఉంటుంది. తెలంగాణలో చంద్రబాబు ఇప్పటికే ప్రతిపక్ష ఐక్యతపై దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నాటకలో దేవెగౌడ పార్టీ, కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి. నిజానికి బెంగళూరు నుంచే చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతకు శ్రీకారం చుట్టారు. హర్యానాలో చౌతాల పార్టీ ఐఎన్‌ఎల్‌డీని దారికి తీసుకురావాల్సి ఉంటుంది. ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఎవరితోనూ పొత్తుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ నవీన్ పట్నాయక్ పార్టీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ తప్పదు. కాకపోతే ఎన్నికల అనంతరం నవీన్ పట్నాయక్‌ను ప్రతిపక్షాల కూటమికి మద్దతిచ్చేందుకు ఒప్పించాల్సి ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా అదే విధంగా ఒప్పించాల్సి ఉంటుంది. ఝార్ఖండ్‌లో కూడా బహుముఖ పోటీలుంటాయి. అక్కడ కూడా ద్విముఖ పోటీకి ప్రయత్నాలు జరగాలి. మహారాష్ట్ర వ్యవహారం కొంత సంక్లిష్టం. కాకపోతే శరత్ పవార్, శివసేనతో చంద్రబాబు తనకున్న పరిచయాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అక్కడ బహుముఖ పోటీలు ఎవరికి లాభిస్తాయన్నది ముఖ్యం. ఇక తమిళనాడు కీలక రాష్ట్రం. అక్కడ బీజేపీ ప్రయత్నాలను వమ్ము చేయడం ఒక అవసరం. బీజేపీ మద్దతిచ్చే పార్టీకి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు కావాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు తలకెత్తుకున్న పని సామాన్యమైనదేమి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.