"కొందరు అయ్యప్ప దీక్ష చేస్తారు. మరికొందరు భవానీ దీక్ష చేస్తారు. రాష్ట్రంలో కరవు నివారణకు నేను జల దీక్ష చేస్తున్నా. కొందరు శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. సోమవారం శివాలయానికి వెళ్తారు. అలాగే సోమవారం నేను పోలవరం సందర్శిస్తా. ప్రతిపక్ష నాయకుడు జగన్ అవగాహన లేని వ్యక్తి. దొంగ లెక్కలు రాసి దొరికిపోయి ఎవరు బెదిరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నాడు. ఆయన తండ్రి హయాంలోనే డబ్బుల కోసం జలయజ్ఞంలో అనేక అవకతవకలు చేశారు. టెండర్లు కూడా రద్దు చేశారు. నేను విఫలమైతే అది ప్రతిపక్ష విజయం కాదు. 5 కోట్ల ప్రజల అపజయం. ఓటమి నా జీవితంలోనే లేదు. సాధించి తీరతా. చరిత్రను తిరిగి రాయడానికే పని చేస్తున్నా" నిన్న పోలవరం సందర్శించిన సమయంలో చంద్రబాబు చెప్పినా మాటలు ఇవి..
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఈ పోలవరం నిర్మాణానికిప్పటికే ఎన్నో అవరాధాలు కల్పించారు. నిర్మాణాన్ని నిలిపేసేందుకు కుట్రలు సాగిస్తున్నారు. గతంలో పట్టిసీమ నిర్మాణ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తయితే రాజకీయాల్నుంచి తప్పుకుంటామంటూ కొందరు అప్పట్లో సవాల్ విసిరారు. పది నెలల్లోనే పట్టిసీమను పూర్తి చేసి చూపించాం.. ఇప్ప టికీ వారికి గొంతు పెగలడంలేదంటూ చంద్రబాబు దుయ్య బెట్టారు. ఒకప్పుడు పోలవరం నిర్మాణ వేగాన్ని ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.
బుధవారం పోలవరం ప్రాజెక్టు గ్యాలరీని ఆయన ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధుల్తో గ్యాలరీలో నడిచారు. కేంద్రం సహకరించక పోయినా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నామని ఆ తర్వాత జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. ఇందుకోసం కోసం మహాసంకల్పం పట్టామన్నారు. 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరిచ్చి తీరుతామంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం కుడికాలువ నిర్మాణం 90శాతం పూర్తయిందన్నారు. ఎడమకాలువ నిర్మాణం 63శాతం పూర్తికావొచ్చిందన్నారు. పోలవరం నిర్మాణంలోని ప్రధాన ఘట్టాలన్నీ అంతర్జాతీయంగా చరిత్ర సృష్టించాయన్నారు. ప్రపంచంలో ఇంతవేగంగా నిర్మితమౌతున్న ప్రాజెక్టు ఇదొక్కటేనన్నారు.