రాష్ట్రంలో రాజకీయం హీట్ ఎక్కింది.ఎన్నికలు సమయం దగ్గర పడుతూ ఉండటంతో, అన్ని పార్టీల్లో హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు కలిసి తన పై దాడి చేస్తూ, ఎన్నికల ఎజెండా సెట్ చెయ్యటంతో, చంద్రబాబు కూడా ఎన్నికలకు పక్కగా వెళ్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జాబితా విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలిసింది. ఇది ధనుర్మాసం.. సంక్రాంతికి నెలరోజుల ముందు వరకూ శుభ ముహూర్తాలు ఉండవంటారు. జనవరి 17వ తేదీవరకు కూడా శుభలగ్నాలు లేవట. అయితే ఈలోగా అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు చంద్రబాబు. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన గత కొన్ని రోజులుగా తరుచూ చెప్తున్నారు.
పార్టీ అంతర్గత సర్వేలు, గూఢచారి నివేదికలు, స్వతంత్ర సంస్థల సర్వేల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. అన్ని నివేదికలను క్రోడీకరించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో సర్వే నివేదికలను పరిశీలించి, క్షేత్ర స్థాయి పరిస్థితులు కూడా తెలుసుకుంటూ,తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బ్యాక్ ఆఫీస్ నుంచి వచ్చిన నివేదికలతో పాటు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ఉంది? శాసనసభ్యుల తీరుపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉంది? నియోజకవర్గంలో మండలస్థాయి ద్వితీయశ్రేణి నేతలతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? వంటి పలు అంశాలనూ సీఎం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. ఈ వడపోతల అనంతరం ముఖ్యమంత్రి 75 నుంచి 100 స్థానాలకు అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తారన్నది పార్టీ వర్గాల భోగట్టా!
ఇక జనవరి 17 తరవాత ఓ మంచి ముహూర్తాన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. అందరి సహకారం ఉండటంతో అభ్యర్థుల గెలుపు సులువు అయింది. ముందుగా పార్టీ టిక్కెట్లు ప్రకటిస్తే చాలదు- అభ్యర్థి గుణగణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తానని ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి మొన్నామధ్యే స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో కలవరం మొదలైందట. మంచి ముహూర్తాలు ఉన్నందున ఈ నెలాఖరుకే తుది జాబితా వస్తుందని అందరూ భావించారు. అయితే కొత్త సంవత్సరంలోనే ప్రకటించవచ్చని మరికొందరు అనుకుంటున్నారు. కానీ అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం చంద్రబాబు ముహూర్తం చూసుకుంటున్నారని తెలిసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. అలా అయితే జనవరి 17 తరవాతే జాబితా విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.