‘‘ప్రభుత్వ పథకాల లబ్ది కోసం కుటుంబాలు వేరుపడటం మంచిదికాదు. ఒకే ఇంట్లో ఉంటూ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల కోసం విడిపోవడం బాధాకరం. తల్లిదండ్రులను బాగా చూసుకునేవారికే సింగపూర్ లో ఇళ్లు, ప్రభుత్వ లబ్ది. అదేవిధంగా మనవద్ద కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేవారికే ప్రభుత్వ పథకాల ద్వారా అధిక లబ్ది కలిగించే అంశం పరిశీలించాలని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలిసివుంటే ప్రభుత్వం నుంచి మరిన్ని వీలైన మేళ్లు కలిగిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. కుటుంబాల పరంగా కాకుండా కుటుంబ సభ్యుల పరంగా ఇకపై పండుగ కానుకలు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు. భారతదేశ కుటుంబ వ్యవస్థ ఎంతో విశిష్టమైనదంటూ, మన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మానవీయ విలువలను కోల్పోరాదని,మనిషి మనిషిగా జీవించాలని ఆకాంక్షించారు. టెక్నాలజి మనిషికి బానిసగా ఉండాలేగాని, మనిషి టెక్నాలజీకి బానిస కాకూడదని హితవు చెప్పారు.
‘‘సాధికారమిత్రల పనితీరు సంతృప్తి కరంగా ఉంది.పట్టణాలలో సాధికార మిత్ర వ్యవస్థ మరింత పటిష్టం చేయాలి. మహిళల్లో నాయకత్వం పెంచేందుకే సాధికారమిత్ర వ్యవస్థ’’ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభల్లో ప్రసంగిస్తున్న విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తోందని,భవిష్యత్ పట్ల అచంచల నమ్మకం కనిపిస్తోందని, వారిలో ఆ స్ఫూర్తిని మరింత పెంచాలన్నారు. ప్రతిరోజూ జన్మభూమి వైద్యశిబిరాలలో లక్షా 20వేల మంది చికిత్స పొందుతున్నారంటూ, వైద్య శిబిరాలను మరింత సమర్ధంగా నిర్వహించాలని కోరారు. ప్రతి పేదవాడికి అత్యున్నత వైద్యం అందించాలని ఆకాంక్షించారు. పశువైద్య శిబిరాలలో 10లక్షల పశువులకు చికిత్స అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ప్రతి గ్రామ సభ ఫొటో,వీడియో తీసి పంపాలని,వాటిని భద్రపరచాలని సూచించారు.
ఇప్పటివరకు 6,15,124 ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ వాటిలో 3,22,912ఫిర్యాదులు(52%) అప్ లోడ్ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు వీటిలో 70,380 ఫిర్యాదులను పరిష్కరించినట్లు చెప్పారు. ఫిర్యాదులు అప్ లోడ్ చేయడం 30%నుంచి 52%కు పెరగడం పట్ల సంతృప్తి ప్రకటించారు. కర్నూలు, చిత్తూరు,విజయనగరం,ప్రకాశం జిల్లాలలో ఫిర్యాదుల అప్ లోడింగ్ మరింత వేగం పుంజుకోవాలన్నారు. రియల్ టైం ప్రాతిపదికన ఫిర్యాదుల అప్ లోడింగ్, పరిష్కారం చేయాలన్నారు. 14వేలమంది డిజిటల్ అసిస్టెంట్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన పని ఏమైందని ఎవరైనా ఆధార్ నెంబర్ చెబితే ఆ అర్జీ ఏ దశలో ఉందో చెప్పే స్థాయిలో ఉండాలన్నారు.