విభజన హామీల అమల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ముస్తాబయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని బొల్లవరం సమీపంలో 86 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభావేదిక, ప్రాంగణాన్ని రూపొందించారు. సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంగణంలో 50 వేల కుర్చీలను ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు.
తొలుత ఈనెల 20న ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు నిర్ణయించగా వర్షం వల్ల 30వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని 1.35 గంటలకు హెలికాప్టర్లో ప్రొద్దుటూరుకు వెళ్లనున్నారు. తొలుత గండికోట ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి సభకు హాజరవుతారు. జగన్‌పై దాడితో పాటు జిల్లాలో సీఎంను తిరగనివ్వబోమంటూ వామపక్ష నేతలు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ధర్మపోరాట దీక్షకు పోలీసులు విస్తృత భద్రత కల్పించారు. తిపక్ష నేత జగన్ సొంత జిల్లా కావడంతో స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబు విధాన ప్రకటన చేస్తారని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు.
కడప నగరంలోని టీడీపీ కార్యాలయం నుండి సోమవారం ఉదయం తెలుగుదేశంపార్టీ శ్రేణులు నగర వీధుల గుండా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ప్రొద్దుటూరులో జరగనున్న ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ప్రజాభిమానాన్ని కూడగట్టేందుకు ఈర్యాలీ నిర్వహించారు. నగరంలోని కొత్తబస్టాండ్‌మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్లకూడలి, వన్‌టౌన్, అప్సర సర్కిల్ మీదుగా ఈర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగున్నర సంవత్సరాలుగా చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకు వారి అభిమానాన్ని కూడగట్టేందుకు ముఖ్యమంత్రి ఈ ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నారన్నారు.