అమరావతి ప్రజాదర్బార్ హాల్లో పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. నీతిఆయోగ్ సమావేశం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని టీడీపీ నిర్ణయించింది. ఎంపీలతో, మంత్రులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయాల దగ్గర ఆందోళనలు, నీతి ఆయోగ్ సమావేశంలో విభజన అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. అలాగే ప్రధాని ప్రసంగం పూర్తయిన వెంటనే ఏపీ అంశాలను ప్రస్తావించి... సమావేశం నుంచి వాకౌట్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈనెల 17న ఉదయం చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
ఇప్పటికే చంద్రబాబు పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక సీఎంలతో మాట్లాడారు. అలాగే పాండిచ్చేరి, పంజాబ్, ఢిల్లీ సీఎంలతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. నీతిఆయోగ్ సమావేశంలో మాట్లాడాక బాయ్‌కాట్ చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా సమాచారం. మరో పక్క బీజేపీ వైఖరి పై కూడా చర్చ జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో గనుల మాఫియా కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అనుచరులకు 9 సీట్లు ఇచ్చి.. అవినీతిపై బీజేపీ పోరాటం అంటే ఎవరైనా నమ్ముతారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి కేసులను ఏడాదిలోపు విచారణ పూర్తిచేయాలని కోర్టులు చెప్పాయని, జగన్ కేసులను నాలుగేళ్లుగా నాన్చడాన్ని ఏమనాలని నిలదీశారు. కేసులు బలహీనపర్చాలని చూడటం కుట్ర రాజకీయం కాదా అని సీఎం ప్రశ్నించారు.
ఒకవైపు కడప స్టీల్ ప్లాంట్ అసాధ్యమని కోర్టులో కేంద్రం అఫిడవిట్ వేస్తుందని, మరోవైపు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో లాలూచీ చేస్తారని ఆయన మండిపడ్డారు. మొన్న కేంద్రం స్టీల్ ప్లాంట్‌పై అఫిడవిట్ వేస్తే.. నిన్న బుగ్గన ఢిల్లీ వెళ్లి రాంమాధవ్‌ను కలవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. పొత్తుతో సాధించలేనిది పోరాటంతో సాధించాలని చంద్రబాబు నేతలకు పిలుపు ఇచ్చారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరుపాటుగా ఉండొద్దని సూచించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడాన్ని నిలదీయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసించాలని బాబు పేర్కొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన 18 అంశాలు, 6 హామీలు నెరవేర్చేదాకా పోరాడాలని అన్నారు.