కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, లాస్ట్ మినిట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు... ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే.. అయితే అంతకు ముందే, కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రసంగిస్తూ... కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయమని తాను చెప్పలేదని సీఎం స్పష్టం చేశారు. అలా చెప్తూనే, ఏపీకి అన్యాయం చేసిన పార్టీకి సహకరించొద్దని మాత్రమే చెప్పానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మనకు అన్యాయం చేసిన వారికి మాత్రం ఓటు వెయ్యొద్దన్నారు. అయితే ఏపీలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాదని సీఎం జోస్యం చెప్పారు.
అవినీతి కేసుల పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందని, లేదంటే ఎన్నికల తరువాత కలుపుకోవాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కేంద్రంతో పోరాడుతుంటే వైసీపీ నాపై పోరాడుతోందని, బీజేపీతో లాలూచీ పడుతున్న వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రమంటే మోదీకి ఎందుకంత చిన్నచూపని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తారా అని మండిపడ్డారు. కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు ద్రోహం చేశాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి తన కష్టార్జితమని వ్యాఖ్యానించారు.
విభజన హామీల అమలు కోసం కేంద్రంపై తాను పోరాడుతుంటే వారితో లాలూచీపడ్డ పార్టీలు తనను విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదుకున్నా.. లేకున్నా అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
2014 ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దానిని నిర్మించి తీరుతామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.