వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ తరఫున మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్,, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ లను పంపించాలని, అది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి కాకుండా, ఇంటికి వెళ్లి అభినందించి రావాలని సూచించారు. చంద్రబాబు సూచనలతో వీరు ముగ్గురూ జగన్ అపాయింట్ మెంట్ కోరగా, అది లభించలేదు. ఈ ఉదయం నుంచి జగన్ చాలా బిజీగా ఉన్నారని, సమయాభావం వల్ల ఎవరినీ కలవలేదని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు సైతం నేరుగా స్టేడియం వద్దకే వెళ్లారని జగన్ కార్యాలయ వర్గాలు వారికి స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరు కూడా స్టేడియం వద్దకు వెళ్లి జగన్ ను కలవవచ్చని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.
దీంతో చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ రాసిన లేఖను మీడియా ద్వారా టిడిపి విడుదల చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తామని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు తెగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.