కేంద్ర సహయం కోసం, ఎదురు చూస్తూ, ఆందోళన బాట పట్టిన రాష్ట్రానికి మరో సమస్య వచ్చి పడింది... ఇది దేశ వ్యాప్త సమస్య అయినా, మన రాష్ట్రంలో ఉన్న తీవ్రతని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు లేఖలు రాసారు... తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల కరెన్సీ పంపాలని లేఖలో రాసారు... నోట్ల రద్దు నాటి పరిణామాలు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయన్నారు... ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు... అదే విధంగా ధాన్యం విక్రయించినా డబ్బులు తీసుకోలేక రైతులు తంటాలు పడుతున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు...
నిజానికి నోట్ల రద్దు లాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి.. ఉన్నట్టు ఉండి కరెన్సీ కొరత ఏర్పడింది... బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్న ఖాతాదారుల్లో ‘పెద్ద నోట్ల రద్దు’ నాటి కలవరం కనిపిస్తోంది. శనివారం సాయంత్రానికి ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఆదివారం నాడు ఏటీఎంలు పనిచేయలేదు. సోమవారం కూడా ఏటీఎంలలో నగదు పెట్టలేదు. మంగళవారం శివరాత్రి. దీంతో నగదు కావాలన్న ప్రజలకు జాగారమే దిక్కు! బ్యాంకుల నుంచి నగదు ఇవ్వకపోవడం, ఏటీఎంలో డబ్బుల్లేకపోవడంతో ప్రజల ఇక్కట్లు వర్ణణాతీతం...
దాదాపు అన్ని జిల్లాల్లోను బ్యాంకు చెస్ట్‌ల నుంచి నగదు పంపిణీ ఆగిపోయింది. రిజర్వుబ్యాంకు నుంచి డబ్బు రావాల్సి ఉందా? చెస్ట్‌లలో ఉన్నా ఇవ్వడం లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.10-12వేల కోట్ల రూపాయలు చెస్ట్‌ల నుంచి బ్యాంకులకు వెళ్తాయి. కానీ శుక్రవారం నుంచి ఇది నిలిచిపోవడంతో నగదు కొరత తీవ్రస్థాయి లో ఉంది... బ్యాంకులు నష్టాల బారిన పడి డిపాజిట్‌దారుల డబ్బును తిరిగివ్వకున్నా.. ఇక చేసేదేమీ లేదన్నట్లుగా ఓ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు వచ్చిన వార్తలతో ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు... డిపాజిట్లను వెంటనే క్లియర్ చేసుకొని, నగదును ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. మళ్లీ డిపాజిట్ చేయడంలేదు. ఇప్పుడు డిపాజిట్లు తగ్గిపోవడంతో వచ్చేది తగ్గిపోయింది. అదే సమయంలో ఖాతాదారులు తీసుకునేదేమో పెరిగిపోయింది.