ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఘాటు లేఖ రాశారు. పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అందులో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘అన్నదాతలను ఆదుకోవడానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది. విద్యుత్తు చట్టం - 2003కు సవరణ ప్రతిపాదించడం అభ్యంతరకరం. ఇది రాష్ట్రాలు ఉచిత విద్యత్తు ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉంది. విద్యుత్తు చట్టానికి సవరణ చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం రైతుకు మేలు చేసేలా ఉండాలి.
ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు 1.08 లక్షలు అవుతోంది. క్వింటాలుకు రూ. 1,702 సాగు ఖర్చవుతోంది. సాగు రూపాయి ఖర్చవుతుంటే మద్దతు ధర 83 పైసలుగా ఉంది. వరితోపాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి. పంటల బీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరం. బ్యాంకులు విధించిన నిబంధనలతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి’’ అని సీఎం లేఖలో వివరించారు. వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. పంటల భీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు విధించిన నిబంధనతో అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమోదు చేయాలన్న నిబంధనతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
‘‘15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లోని నాలుగో సూచనలో... జనాకర్షక పథకాలపై రాష్ట్రాలు చేసే ఖర్చును నియంత్రించేలా ఒక అంశం పెట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను కూడా జనాకర్షక పథకంగా చూపించి... దీనిని అమలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత విధించేలా ఈ నిబంధన ఉంది. ఇది రైతుల సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘విద్యుత్ అం శం కేంద్ర - రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంది. దానిపై రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా సవరణ ప్రతిపాదనలు తేవాలని ఆలోచించడం సరికాదు. ఏపీలో 50శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఉచిత విద్యుత్‌ను నిలిపివేయడమంటే... వారికి అన్యాయం చేయడమే’’ అని సీఎం పేర్కొన్నారు.