‘మీ టూ’.. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న పెద్ద ఉద్యమం. ఆడవాళ్ళ పై జరుగుతున్న లైంగిక దాడులకు, ఎంతటి వారైనా వారికి తగిన శిక్ష పడేలా, ఆడవాళ్ళు దైర్యంగా ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమ ధాటికి, సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఇదే స్పూర్తి తీసుకుని, కేంద్రం పై పోరాటం చేయ్యమంతున్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ‘మీ టూ’లా ఉద్యమించి కేంద్రాన్ని దారికి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుజాతికి పిలుపునిచ్చారు. తిత్లీ బాధితులను ఆదుకోవాలని, రాష్ట్రానికి న్యాయం జరగాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ‘మీ టూ’ మాదిరిగా తెలుగు జాతి ఉద్యమిస్తుందన్నారు.
న్యాయం చేసే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని అంతా కంకణబద్ధులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీ మైదానంలో గురువారం దుర్గా పూజ చేసిన చంద్రబాబు తన ఈ సంకల్పాన్ని వివరించారు. అలాగే తిత్లీలో బాధితులకు పరిహారాన్ని అందించడంలో ఎక్కడా పైసా అవినీతికి తావివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. నష్టాల అంచనాలో ఎక్కడా దళారులకు చోటు ఉండదన్నారు. నష్టాల అంచనాలో గాని, పరిహారాన్ని అందించడంలో గాని ఎవరైనా రాజకీయాలు చేస్తే సహించనన్నారు. నష్టపోయిన వారికి రాజకీయాలకు అతీతంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
తుపాను తీరం దాటడంపై సరైన అంచనాకొచ్చాం కాబట్టే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించుకోలిగాం. ఈ జిల్లాలో 9 మంది.. విజయనగరంలో ఇద్దరు చనిపోయారు. 15 మంది మంత్రులు జిల్లాలోనే ఉన్నారు. 25 మంది ఐఏఎస్ అధికారులు, 90 మంది డిప్యూటీ( కలెక్టర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. వారిని అభినందిస్తున్నా. విజయదశమి చాలా ముఖ్యమైన పండగ. అయినా ఎవరం దసరాకు వెళ్లలేదు. ఇక్కడే పలాసలో దసరా చేసుకుంటున్నామంటే అది మీపై ఈ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి తార్కాణం. నష్టపోయిన ప్రాంతాలకు పూర్వ వైభవం తెస్తా. ఆదుకునేందుకు దాతలు, సేవా సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, దేశవిదేశాల్లో ఉన్నవారు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు.