ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ఖరారుకావడంతో నిన్న సాయంత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అనంతరం శుక్రవారం ఉదయం 10:30గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన చంద్రబాబు మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా 13 అంశాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో ప్రస్తావించిన పలు అంశాలను వివరించారు. రాజధాని నిర్మాణానికి సహకరించాలని ప్రధానిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. 9వ షెడ్యూల్‌లోని సంస్థలను ఏర్పాటు చేయాలని, దుగరాజపట్నం పోర్టును పూర్తిచేయాలని ప్రధానిని కోరినట్లు ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, హోదాలోని అన్ని అంశాలను ప్యాకేజీలో ఇస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలోని అన్నింటినీ వెంటనే ఇవ్వాలని కోరామని, విభజన హామీల అమలుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈఏపీ కింద ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లు ఇప్పించాలని ప్రధానిని అడిగినట్లు ఆయన చెప్పారు. రైల్వేజోన్ విషయం త్వరగా తేల్చాలని ప్రధానిని కోరామని, నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వెంటనే తేల్చాలని విన్నవించానని చంద్రబాబు వివరించారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,217 కోట్లను తిరిగి ఇప్పించాలని కోరారు.
ఈ సమయంలో విలేకరులు ప్రశ్నలు అడుగుతూ, మీరు ఎంత కాలం ఇలా ఓర్పుగా ఉంటారు ? భేటి ఎలా జరిగింది ? మీరు కేంద్రంతోనే ఉంటారా లాంటి ప్రశ్నలు విలేకరులు అడిగారు.. దానికి చంద్రబాబు మాట్లాడుతూ, నాకు ఇక్కడ రాజకీయాలు అనవసరం... నాకు రాష్ట్ర సమస్యలు ముఖ్యం... ఆశా, నమ్మకంతో, ముందుకు వెళ్తూనే ఉంటా... పోరాడుతూనే ఉంటా... గత కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసేంది, ఈ ప్రభుత్వం సహకరించాలని, మాకు చేయూత ఇవ్వాలి అని కోరుకుంటున్నా... రాష్ట్రం కోసం, రాష్ట్రనికి మంచి జరగటం కోసం, ఎంత ఓర్పుగా సహనంగా, భేషీజాలకు పోకుండా, రాజకీయాలు చెయ్యకుండా, ఉండటమే నాకు తెలిసింది అని చెప్పారు...