బీజేపీ పై యుద్ధం ప్రకటించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. జాతీయ స్థాయిలో దూకుడు పెంచుతూ.. బీజేపీయేతర పార్టీల కూటమి కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నెల రోజులుగా రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన టీడీపీ అధినేత.. ఒక్కో పార్టీని యాంటీ బీజేపీ ట్రాక్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో నెల రోజులుగా చంద్రబాబు సోషల్ మీడియా ఫాలోయింగ్ తెగ పెరిగిపోతోందంట. ముఖ్యంగా కూటమి ప్రయత్నాలు ప్రారంభించాక ఫాలోయింగ్ పెరిగిపోయింది. గత నెల రోజులుగా 18వేలమంది కొత్తగా చంద్రబాబు ట్విట్టర్అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.
ఇక ఫేస్‌బుక్ విషయానికొస్తే.. 90వేలమంది కొత్త ఫాలోవర్లు. చంద్రబాబుకు (@ncbn)కు మొత్తంగా.. ట్విట్టర్‌లో 4.08మిలియన్ల ఫాలోవర్లు.. ఫేస్‌బుక్‌లో 14,87,189మంది నెటిజన్లు ఉన్నారు. సీఎం హోదాలో ఉన్న బాబు (@APCMO) ఫేస్‌బుక్ అకౌంట్‌ను 1,88,940మంది ఫాలోవర్లు.. ట్విట్టర్ ఖాతాను 4,09,866మంది ఫాలో అవుతున్నారు. అది కూడా.. చంద్రబాబు యాంటీ బీజేపీ కూటమి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచి.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందంటున్నారు సీఎంవో అధికారులు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2009 నుంచి చంద్రబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ ఏడాది జూన్ నాటికి ట్విట్టర్ ఫాలోవర్లు సంఖ్య 4 మిలియన్లకు చేరగా.. ఇప్పుడు అది 4.08మిలియన్లకు పెరిగింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ట్విట్టర్‌లో 4 మిలియన్ ఫాలోవర్లు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనకు మద్దతు తెలుపుతూ.. సూచనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తన ట్విట్టర్‌లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెలుగులో ట్వీట్ చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేప్పుడు మాత్రం ఇంగ్లీష్ ఉపయోగిస్తున్నారు.