ఇప్పటికే కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగిన తెలుగుదేశం పార్టీ, త్వరలోనే ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేయటానికి సమాయత్తమవుతోంది. కేంద్ర మంత్రుల రాజీనామాను మొదటి అస్త్రంగా పరిగణించిన తెలుగుదేశం కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని సంకల్పించింది. దశల వారీగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీకి తాజాగా కేంద్రం వ్యవహరించిన తీరు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జప్తు చేసిన రూ.34 కోట్లను ఈడీ ద్వారా తిరిగి ఇప్పించడాన్ని, ఏ విధంగా అర్ధం చేసుకోవాలంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తుంది... అదే విధంగా, విజయసాయి రెడ్డి, మాకు మోడీ మీద పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పి, మళ్ళీ అవిశ్వాసం అని డ్రామాలు ఆడటం కూడా గమనిస్తుంది.
అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని విధాల ఆదుకోవడంతో పాటు కేంద్రం నుంచి విభజన చట్టం, హామీల అమలు కాకపోవడంపై మెట్టు దిగే వీలులేదని టీడీపీ సంకేతాలు ఇచ్చింది. అయితే ఒక వైపు కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం, మరో వైపు ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తున్న నేపధ్యంలో తాజాగా జప్తు చేసిన ఈడీ ఆస్తులను తిరిగి ఇవ్వడం వెనుక పెద్ద మతలబు ఉందనే దిశగా ఈ రోజు జరిగిన భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారంచంద్రబాబు అభిప్రాయ పడుతున్నారు. పార్లమెంటులో కేవలం నలుగురు సభ్యుల మద్దతు ఉన్న వైఎస్సార్ సీపీ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదంగా ఉందనే దిశగా కూడా చర్చ జరిగింది.
అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలని పేర్కొన్న నేతలు వైఎస్సార్ సీపీని ముద్దాయిల పార్టీ అని, అలాంటి పార్టీని తెలుగుదేశం కాదు కదా, ఇతర పార్టీల మద్దతు కూడా లభించబోదనే అభిప్రాయం వ్యక్తమైంది. కేసుల మాఫీ కోసం వైఎస్సార్ సీపీ కుప్పిగంతులు వేస్తోందని, ఢిల్లీ చుట్టూ, ప్రధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నదని దుయ్యబట్టిన ముఖ్యమంత్రి, ఇతర నేతలు ప్రజా క్షేత్రంలోనే ఎత్తుగడలను తిప్పి కొట్టాలని నిర్ణయించారు. యధావిధిగానే పార్లమెంటు వేదికగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని జాతీయ రాజకీయాలను నిశితంగా పరిశీలించి, బీజేపీ - వైసిపీ డ్రామాలు చూసి, మరో అస్త్రాన్ని ప్రయోగించాలనే నిర్ణయానికి నేతలు వచ్చారు.
చట్ట బద్దంగా ఇచ్చిన హామీలు విభజన అంశాల పై సుప్రీం కోర్టుకు వెళ్ళాలనే దిశగా కూడా కసరత్తు చేశారని సమాచారం. తొలుత సుప్రీంకోర్టులో కేసు వేసిన తరువాతే కేంద్రం స్పందనను బేరీజు వేయాలని చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా రావాల్సిన విభజన చట్టంలోని హామీల పై, ఇన్నాళ్ళు ఓర్పుగా చూసాం అని, ఇక ఉపేక్షించేది లేదని, చంద్రబాబు చెప్తూనే ఉన్నారు... అయితే, ఇప్పుడు కోర్ట్ కి వెళ్తే, అవి వెంటనే విచారణకు వస్తాయా ? ఇప్పుడు కేంద్రం ఏమన్నా చెయ్యాలనుకున్నా, కేసు తేలేదాకా వీలు ఉంటుందా అనే అంశాల పై కూడా, లోతుగా చర్చిస్తున్నారు... రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటే, ఎంతటి నిర్ణయం అయినా తీసుకుంటానికి రెడీ అని చంద్రబాబు చెప్తున్నారు... ఎన్డీయేతో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన బంధాన్ని కూడా సమీక్షించి, సమీప భవిష్యత్తులో అనుసరించనున్న వ్యూహంపై కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు..