బుధవారం, నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామనారాయణరెడ్డిని విషయం ప్రస్తావనకు వచ్చింది. తనకు పార్టీలో గౌరవం లభించడం లేదని, అందువల్ల పార్టీని వీడాలనుకొంటున్నానని ఆయన చెబుతున్నారని కొందరు సీఎం దృష్టికి తెచ్చారు. ‘ఆనం రామనారాయణరెడ్డిని ఇక్కడ ఏం అగౌరవపర్చాం? ఆయన ఎందుకు అలా అనుకొంటున్నారు? నేను ఆయనకు గౌరవం ఇవ్వనిదెప్పుడు...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆనంకు ఉన్న సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని, ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
‘నేను కూడా పత్రికల్లో చూశాను. ఆయన ఎందుకలా అనుకుంటున్నారు? ఆయనకు ఎక్కడ గౌరవం ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. ఆయన సీనియారిటీని గౌరవించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చాం. ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలనుకొన్నాను. కానీ అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డి కూడా నన్ను కలిసి తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని కోరారు. ఇద్దరూ అడగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది. అందుకే ఇవ్వలేకపోయాను. ’ అని సీఎం వారికి వివరించారు. అయినా, ఆయనకు నేను ఎక్కడా గౌరవం ఇవ్వకుండా లేనని, మన దగ్గరే గౌరవం లేదు అంటుంటే, జగన్ దగ్గరకు వెళ్తే, ఎలాంటి గౌరవం ఇస్తారో అందరికీ తెలిసిందే అంటూ, సియం అన్నారు.
ఇదే సమయంలో తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆనం సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి చంద్రబాబుకు స్పష్టం చేశారు. పార్టీని వీడటానికి రామనారాయణరెడ్డి చెబుతున్న కారణాలు తనకు కూడా సబబుగా అనిపించలేదని... అందుకే టీడీపీలోనే ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా జయకుమార్ రెడ్డిని చంద్రబాబు అభినందించారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, ఎవరూ ఏది మనసులో పెట్టుకోకుండా, పని చెయ్యాలని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా, నాతో చెప్తే, తగు చర్యలు తీసుకుంటామని, ప్రజల మన్ననలు పొందితే చాలని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ లు పాల్గొన్నారు.