బుధవారం చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర విభజన హామీలపై కీలక ప్రసంగం చేశారు.. రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. అసెంబ్లీ సీట్లు పెంచమని విభజన చట్టంలో ఉందని... కాని ఈ విషయాన్ని తాను అడగదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... ఇలా అడిగితే మళ్ళీ రాజకీయం చేస్తున్నా అంటారు... అన్ని విషయాలు వదిలేసి, ఇదే అడుగుతున్నా అంటారు... ఇది ఇవ్వకపోయినా పరవాలేదు, మిగతా అన్ని విభిజన హామీలు నెరవేర్చండి అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసారు.. నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. అందరినీ కలిశాను. పదేపదే విజ్ఞప్తి చేశాను. మా మంత్రులను, అధికారులను, ఎంపీలను పంపాను. ప్రత్యేకహోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరంటే చాలామంది ఆందోళన చెందారు. భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో ప్రధానికి ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తే.. ఆయన రమ్మన్నారు. దిల్లీకి వెళ్లాం. నీతిఆయోగ్‌ను పిలిచి చెబితే అన్నీ వివరించాం.
పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేసినప్పుడు ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోరాడి బిల్లులో కొన్ని అంశాలు పెట్టి పాస్ చేయించారు. మరి దాన్ని అమలుచేయడంలో మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకింత ఉదాసీనత? అని అడుగుతున్నా. అప్పుడు ఆంధ్ర ప్రజలు పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. సరికాదని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతున్నప్పుడు ఎందుకు కనికరించడంలేదు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. నాలుగేళ్లు నేను ఆవేదనతో, బాధతో ఎంతో ఓపికగా 29సార్లు దిల్లీకి వెళ్లి అడిగితే కనీసం కనికరించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే ఎందుకు అమలుచేయడంలేదు. మేం సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం.