ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బదిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఎందుకు బదిలీ చేశారో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోని ఎన్‌ఏడీ కూడలిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే మన కలెక్టర్‌ను మార్చారు. మొన్న ఇద్దరు ఎస్పీలు..ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు. ఈ రోజు మన సీఎస్‌ను మార్చారు. దీనిపై ఎన్నికల సంఘాన్ని నిలదీయాలా.. లేదా?’’ అని వ్యాఖ్యానించారు. ఏ తప్పు చేయని సీఎస్‌ను బదిలీ చేస్తారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కేంద్రం చేస్తున్న దుర్మార్గాలను ఖండిస్తున్నాను. వీవీ ప్యాట్లను లెక్కించడం సాధ్యం కాదంటున్నారు. తెలంగాణలో ఓట్లు గల్లంతు అయితే ఈసీ ఏం చేసింది?. కోడికత్తి పార్టీకి ఈసీ సహకరిస్తోంది. వైసీపీ అభ్యర్థులంతా నేరస్థులు, కబ్జాదారులే. రౌడీలు అధికారంలోకి వస్తే భద్రత ఉండదు" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
" నేరస్థులను నేనెప్పుడూ ప్రోత్సహించలేదు. మతకలహాలను, తీవ్రవాదాన్ని అణచివేశాను. నాపై 24 బాంబులేసినా భయపడలేదు. మనల్ని ఏకాకి చేసి ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తున్నారు. మా అభ్యర్థులు, నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు. అవసరమైతే జైలుకెళ్తా, భయపడేది లేదు. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇష్టానుసారం ముందుకెళ్తే మోదీ ఖబడ్దార్. ఎంత మంది వస్తారో రండి, నేను భయపడను, రా మోడీ" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజీలేని పోరాటం చేసినప్పటికీ విశాఖకు తలలేని మొండెంలా కేంద్రం రైల్వేజోన్ ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. హుద్‌హుద్ తుపానుతో విశాఖ నగరం అతలాకుతలమైతే ప్రధాని మోదీ రూ. వెయ్యి కోట్లు ప్రకటించి, రూ. 650 కోట్లు మాత్రమే ఇచ్చారని.. మరో రూ. 350 కోట్లు ఎగ్గొట్టేశారని దుయ్యబట్టారు.
మోదీ గొప్పవారంటూ కోడికత్తి పార్టీ చెబుతోందని, దిల్లీ నాయకులతో చెప్పి మనపై దాడి చేయిస్తోందని వైకాపాను ఉద్దేశించి సీఎం ఆరోపించారు. ‘‘ పవన్‌కు ఒకేదారి తెలుసు అదే అత్తారింటికి దారి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఓటేస్తే మీ ఓటు వృథా అవుతుంది. విశాఖకు పూర్వ వైభవం తేవాలంటే అది కేవలం తెదేపాతోనే సాధ్యం’’ అని చంద్రబాబు వివరించారు. పట్టణప్రాంత పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం రూ.25 లక్షలు ఇస్తామన్నారు. వైకాపా అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ అంతర్జాతీయ నేరస్తుడని.. ఆయన ఉండాల్సింది కటకటాల్లో అని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ డేగ కన్ను ఏపీపై పడొద్దని చెబుతూనే.. వైకాపా అధ్యక్షుడు జగన్ ఆయనకు వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.